హైదరాబాద్: నరేంద్రమోడి మద్దతుదారుగా పేరున్న యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వ పాలనలో నల్లధనం పెరిగిపోతూనే ఉందని అన్నారు. నల్లధనం రెండు రకాలని, ఒకటి కుంభకోణాల ద్వారా సృష్టించబడేదని, రెండోది పన్నుల ఎగవేత ద్వారా ఏర్పడేదని అన్నారు. ఈ సంవత్సరమున్నర కాలంలో ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. దేశంలో మత అసహనం లేదని అన్నారు. అదే ఉండి ఉంటే ఆమిర్ ఖాన్ కిరణ్ రావును వివాహం చేసుకోగలిగేవాడే కాదని చెప్పారు. దేశంలో ఉన్న అందరి డీఎన్ఏ ఒక్కటే అన్నారు. తనకు గాళ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. అయితే చాలామంది తనకు ప్రపోజ్ చేశారని, ఒక నటికూడా అలాగే చేస్తే తాను పారిపోయానని తెలిపారు. అమృత్ బజార్ పత్రిక గ్రూప్ వారి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న దీవులలో ఒకదానిని తీసుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర షిప్పింగ్ శాఖమంత్రి నితిని గడ్కరి బాబా రాందేవ్‌కు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. ఇలాంటి దీవుల వలన టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందని గడ్కరి నిన్న ఢిల్లీలో ఒక కార్యక్రమంలో అన్నారు. దేశవ్యాప్తంగా ఇలా అభివృద్ధి చేయటానికి అవకాశం ఉన్న 70 లైట్ హౌస్‌లు, 700 దీవులను గుర్తించినట్లు తెలిపారు. యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ అండమాన్, నికోబార్, లక్షద్వీప్‌లలో రెండు దీవులను తీసుకుని టూరిజం సెంటర్లుగా అభివృద్ధి చేయటానికి ఆసక్తి చూపారని చెప్పారు. ఈ 700 దీవులను కేటాయించటానికి వేలంపాటలు నిర్వహిస్తామని గడ్కరి తెలిపారు. బాబా రాందేవ్ స్కాట్‌ల్యాండ్‌లోని ఒక దీవిని ఇలాగే యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని కొన్నిరోజుల క్రితం వార్తలొచ్చాయి. కేంద్రం అందుకే ఈ ఆఫర్‌ను రాందేవ్‌కు ఇస్తున్నట్లు కనబడుతోంది.