ముంబైలోని బాంద్రా ఏరియా. సినిమాలపై ఆసక్తి ఉన్న వారందరికీ ఆ ఏరియా ప్రాముఖ్యత ఏమిటో తెలుసు. ఆ ఏరియాలో మాజీ ఎమ్మెల్యేను అదీ కూడా పవర్ లో ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పార్టీకి చెందిన బాబా సిద్దిఖీని కాల్చి చంపేశారు. తన కుమారుడు కార్యాలయం ఎదుట దసరా సందర్భంగా టపాసులు కాలుస్తున్న సమయంలో దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. ఆయన అక్కడిక్కడే చనిపోయారు.
బాబా సిద్దిఖ్ బాలీవుడ్ స్టార్లకు అత్యంత ఆప్తుడు. ఎంతగా అంటే వారి పంచాయతీలు ఏర్పడితే ఆయనే సెటిల్ చేస్తారు. సల్మాన్, షారుఖ్ మధ్య గొడవల్ని ఆయనే సెటిల్ చేశారు. సంజయ్ దత్ కు అత్యంత సన్నిహితుడు. భారీ పార్టీలు ఇస్తూంటాడు. పదవిలో ఉన్నా లేకపోయినా పవర్ ఫుల్. ఎందుకంటే యాభై ఏళ్లుగా బాంద్రానే అడ్డాగా చేసుకున్న లీడర్. ఆయనను కాల్చి చంపడం అంటే చిన్న విషయం కాదు. ఇటీవల సల్మాన్ ఇంటి ముందు కూడా కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
ముంబైలో పరిస్థితులు చూస్తూంటే.. మళ్లీ గ్యాంగ్ స్టర్ల రాజ్యం వచ్చిందే మో అన్న ఆందోళన అక్కడి స్టార్లతో పాటు అందరిలోనూ వ్యక్తమవుతోంది. అక్కడ రాజకీయాలు అనిశ్చితంగా ఉన్నాయి. ముంబైలో ఉండే గ్యాంగ్ స్టర్లు అందరికీ రాజకీయ నేతల సపోర్టు ఉంటుంది. ఏ పార్టీ అన్నది మ్యాటర్ కాదు. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో బలహీన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఇది కూడా సమస్యగా మారుతోంది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు నింపుతున్నాయి.