ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇరువురూ కూడా తెదేపా, బీజేపీల తరపున జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని తాజా సమాచారం. నారా లోకేష్ ఈనెల 22 నుంచి 27 వరకు పార్టీ తెలంగాణా నేతలతో కలిసి డివిజన్లలో పాదయాత్రలు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే చంద్రబాబు నాయుడు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ఎంపికచేసిన డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు నారా లోకేష్ పార్టీ నేతల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం నిజం కాలేజి మైదానంలో తెదేపా, బీజేపీలు కలిసి నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ తెరాస ప్రభుత్వాన్ని, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని చాలా తీవ్రంగా విమర్శించారు. కానీ అదే సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు మాత్రం తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని పల్లెత్తు మాట అనకుండా, హైదరాబాద్ నగరాన్ని తాను ఏవిధంగా అభివృద్ధి చేసినది వివరించి సరిపెట్టారు. కనుక తను నిర్వహించబోయే రోడ్ షోలో కూడా అదే విధంగా మాట్లాడే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించకపోయినా, ఆయన ఆంధ్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాలలో రోడ్ షోలు నిర్వహించినట్లయితే తప్పకుండా వారిపై ఆ ప్రభావం ఎంతోకొంత పడుతుంది కనుక తెదేపా, బీజేపీ అభ్యర్ధులకు దాని వలన ప్రయోజనం కలుగవచ్చును. ఈ ఎన్నికలలో ఎలాగయినా గెలిచితీరాలనే పట్టుదలగా ఉన్న తెరాస ఒక మెట్టు దిగి, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన కొందరిని తన పార్టీ అభ్యర్ధులుగా నిలుపుతోంది. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కారణంగా తన పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని భావించినట్లయితే, మళ్ళీ తెరాస నేతలు అందరూ వారిరువురిపై విమర్శలు గుప్పించవచ్చును. ఏమయినప్పటికీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రచారానికి అంగీకరించడం విశేషమే అని చెప్పుకోవచ్చును.