లక్ష్మి, తులసీ, చిత్రాలతో హిట్ పెయిర్ గా అలరించి, ఈ సారి ‘బాబు బంగారం’ అంటూ విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్లో, వరుస సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు మారుతి డైరక్షన్ లొ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బాబు బంగారం’ చిత్రాన్ని ఈ రోజు న ప్రపంచవ్యాప్తంగా విడదల చేసారు. ఫ్యామిలి ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకుని విక్టరీ వెంకటేష్ చేసిన 70 వ చిత్రం ఇది. మరి మరో సారి వెంకటేష్, నయనతారల కాంబినేషన్ సక్సెస్ అయ్యిందా…వరస హిట్స్ తో వున్నా మారుతీ మళ్ళి హిట్ కొట్టాడా… ఇటీవల అ.ఆ..తో సక్సెస్ లో వున్నా నిర్మాతలు మరో విజయం సాధించారా? అన్నది సమీక్ష లో తెలుసుకుందాం….
కథ :
ఏ సి పి కృష్ణ (వెంకటేష్) తన తాత ఆనవాయె ఏమిటో గాని ప్రతి ఒక్కరిపై జాలి, దయ చూపిస్తూ ఉంటాడు. వృత్తి రీత్యా అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ అయివుంది కూడా, నేరస్థులను కూడా అదే దృష్టి తో జాలి చూసే మనస్థత్వం అతడిది. అలాంటి మంచి వాడికి శైలజ (నయనతార) అనే అమ్మాయి తో పరిచయమవుతుంది. అనతి కాలం లోనే కృష్ణ ఆమెకు దగ్గరై ప్రేమలో పడతాడు. అయితే శైలజ కుటుంబానికి మాత్రం ఎమ్మెల్యే పుచ్చప్ప (పోసాని కృష్ణమురళీ), మల్లేష్ యాదవ్ (సంపత్ రాజ్)ల నుంచి ఓ ఆపద ఉంటుంది. శైలజ కుటుంబానికి ఉన్న ఆపద ఏంటి? కృష్ణ, శైలజకు దగ్గర కావడానికి గల ఏదైనా ఆంతర్యం ఉందా? శైలజ కుటుంబాన్ని కష్టాల బారి నుంచి తప్పించి పుచ్చప్ప, మల్లేష్‌ల ఆగడాలను కృష్ణ ఎలా ఆటపట్టించాడు? అన్నదే మిగతా కథ….
నటి నటుల పెర్ఫార్మన్స్ :
ఏ.సి.పి కృష్ణ పాత్రలో వెంకటేష్ నటన బాగా నవ్వించింది. వెంకటేష్ ఎప్పుడు ఫామిలీ ప్రేక్షకులను అలరించే వాడు కానీ, చాలా సినిమాల తరువాత మళ్ళి ఈ సారి ఫన్నీ రోల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సన్నివేశాల్లో వెంకటేష్ తన నటనలో చూపించిన వేరియేషన్ చాలా బాగుంది. ఈ సినిమా లో నయనతార లుక్ చాలా బాగుంది. వెంకటేష్ తో ఆమె కెమిస్ట్రీ మరో సారి బాగానే కుదిరింది. 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ ‘బత్తాయి బాబ్జీ’ పాత్రలో చాలా బాగా నవ్వించాడు. అతని కోసం మారుతి రాసుకున్న క్యారెక్టర్ బాగా వర్కవుటైంది. వెన్నెల కిశోర్, బ్రహ్మానందం లు అక్కడక్కడా నవ్వులు పండించారు. పోసాని సినిమా మొత్తం తన పాత్రలో బాగానే నటించాడు. మిగతా నటి నటులు వారి పరిధి లో వాళ్ళు నటించారు.
సాంకేతిక వర్గం:
భలే భలే మగాడివోయ్..చిత్రం తో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేసిన మారుతీ పెద్ద స్టార్ తో సాదించ లేక పోయాడు. ఇదే సబ్జెక్ట్ తో ఇదవరకే మనం చాలా సినిమాలు చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. కథ రొటీన్ గా ఉండి సినిమా ఎక్కడ ఆసక్తికరంగా ఉండదు సినిమా నడుస్తున్న కొద్ది తరువాత ఏం జరుగుతుందో ముందుగానే ఊహించేయ్యవచ్చు. కేవలం స్టార్ హీరో చుట్టూ కథను అల్లుకుని, మారుతీ స్టైల్ కామెడీ ని మిక్స్ చేస్తూ రెడీ చేసుకున్న కథ ఇది. కాంబినేషన్ పరం గా హై ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం చాలా నిరుత్సహ పడతాం. దర్శకుడు మారుతి వెంకటేష్ నుండి రెండు వేరియేషన్లలో నటనను రాబట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ పరవా లేదు. జిబ్రాన్ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సంగీతానికి తగ్గట్టు దర్శకుడు మారుతి పాటలను చిత్రీకరించిన తీరు కూడా బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ పరవా లేదు. డార్లింగ్ స్వామి వెంకటేష్, పృథ్వీ ల పాత్రలకు రాసిన డైలాగులు బాగున్నాయి. నిర్మాణ విలువలు బడ్జెట్ కు తగినట్టుగా వున్నాయి.
విశ్లేషణ:
‘బాబు బంగారం’ స్టోరీ లైన్ ఏ మాత్రం కొత్తదనం లేదు కానీ…. టూ షేడ్స్ తో వెంకటేష్ నటనలో చూపిన భిన్నత్వం బాగుంది… మొదటి హాఫ్ లో సాగే కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ మాత్రం సీన్స్ సీరియస్ గా నడుస్తూ కాస్త బోర్ కొట్టించాయి. మారుతి రాసుకున్న కథను కధనం ద్వారా నే బాగానే హ్యండిల్ చేసి సినిమాని కాస్త ఆసక్తికరంగానే చూపించాడు. గత చిత్రాలను పోల్చుకుంటే కాస్టింగ్ పరంగా మంచి కాంబినేషన్ కుదిరిన ఈ ప్రాజెక్టు ని సరిగ్గా డీల్ చేసుకోలేదు డైరెక్టర్ మారుతీ. కాంబినేషన్స్, బ్యానర్, డైరెక్టర్ ల గత సక్సెస్ లు లెక్క లోకి తీసుకుని అంచనాలను కాస్త కంట్రోల్ లో పెట్టుకుని, ఏ మాత్రం లాజిక్ లు పట్టించుకోకుండా, సరదాగా కాస్త నవ్వుకుందాం అనే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5
బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్,
నటి నటులు : విక్టరి వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, బ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి, పృద్వి, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మజి, సంపత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మున్నా వేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర, రజిత, గుండు సుదర్శన్, ప్రత్యేక గీతం లో సోనమ్ బజ్వా తది తరులు…
డాన్స్ : బృంద, శేఖర్
ఫైట్స్ : రవి వర్మ
ఆర్ట్ : రమణ వంక
ఎడిటర్ : ఉద్దవ్.ఎస్.బి
సంగీతం : జిబ్రాన్,
మాటలు : ‘డార్లింగ్’ స్వామి,
పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, భాస్కరబట్ల రవి కుమార్, శ్రీ మణి,
సమర్పణ : ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
హారిక & హాసిని క్రియేషన్స్ ద్వారా పంపిణి,
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్,
కథ,కథనం,దర్శకత్వమ్ : మారుతి,
విడుదల తేదీ : 12.08.2016.