తెలుగు ప్రజలకు పట్టిన శని ఏదైనా ఉందంటే అది మీడియానే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న అన్ని రాజకీయ దారుణాలకు మీడియా కూడా చాలా వరకూ కారణం అవుతోంది అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. దివాకర్స్ బస్సు ప్రమాదం, పుష్కర ప్రమాదం, జగన్ కేసులు, ఓటుకు నోటు కేసు……ఇలా రాజకీయ తప్పిదాలు ఉన్నప్పుడల్లా ఆ తప్పులను ప్రజలకు వివరించి తప్పు చేయాలంటనే నాయకులు భయపడేలా చేయాల్సిన మీడియా పూర్తిగా డబ్బులకు, స్వార్థ ప్రయోజనాలకు అమ్ముడిపోయి తప్పులను కవర్ చేసే ప్రయత్నం చేస్తూ నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి కారణమవుతోంది. ప్రభుత్వ వ్యవస్థలు, హాస్పిటల్స్‌తో సహా కార్పొరేట్ వ్యవస్థలు కూడా ప్రజలకు బ్రతికుండగానే నరకం చూపించే స్థాయి తప్పులు చేస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మీడియానే. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తూ మంచి వైపు నిలబడాల్సిన మీడియా తప్పుడు జనాలకు తాబేదార్లుగా వ్యవహరిస్తూ వాళ్ళ తప్పులను సమర్థించే స్థాయికి దిగజారడమే సమాజంలో జరుగుతున్న అన్ని దారుణాలకు ఒక ప్రధాన కారణం అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు.
ఓటుకు నోటు కేసు తర్వాత నుంచి చంద్రబాబు వ్యవహార శైలి చూసినవాళ్ళకు ఎవరికైనా చంద్రబాబు మోడీ, కేసీఆర్‌ల దగ్గర ఎంతలా సాగిలపడ్డాడో సులభంగానే అర్థమవుతుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును గెలిపించడానికి ఒక ప్రధాన కారణం బాబు అయితేనే కెసీఆర్పైన పోరాడగలడని. ఎందుకంటే అంతకుముందే కెసీఆర్ దగ్గర జగన్ బెండ్ అయిపోయి ఉన్నాడు కాబట్టి. ఓటుకు నోటు కేసు ముందు వరకూ కెసీఆర్‌తో పోరాటానికే మొగ్గు చూపిన చంద్రబాబు…….ఆ తర్వాత మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా ఫణంగా పెట్టేస్తూ కెసీఆర్‌కి సామంతుడిలా మారిపోయాడు. అంతకుముందు వరకూ 2019లో తెలంగాణాలో కూడా అధికారంలోకి తీసుకొస్తా అని ప్రగల్భాలు పలికిన బాబు ఆ తర్వాత తెలంగాణాలో టిడిపిని కూడా గాలికి వదిలేశాడు. ఇక మోడీ దగ్గర చంద్రబాబు ఎలా ఉంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిధులు, బడ్జెట్ లోటు నిధులు……ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని ప్రధాన విషయాల్లోనూ రాష్ట్రాన్ని మోసం చేశాడు మోడీ. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే మిషతో ఓటుకు నోటు కేసు, తన అవినీతి వ్యవహారాల కోసం మోడీకి సరెండ్ అయిపోయాడు చంద్రబాబు. ఈ మూడేళ్ళ కాలంలో రాష్ట్రానికి కేంద్రం ఎంత అన్యాయం చేసిందో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు సాగిలపడి ఉంటే….ఈ మూడేళ్ళలో సాధించిన ఒక ప్రధాన ప్రయోజనం ఏంటో చెప్పమనండి. పోలవరం ప్రాజెక్ట్ పెంచిన అంచనాలకు సంబంధించిన నిధులు మేం ఇవ్వం అని కేంద్రం విస్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ ఆ విషయంపై చంద్రబాబుకు కనీసం మాట్లాడే ధైర్యం లేకపోయింది.
ఇక మూడేళ్ళుగా నరేంద్రమోడీతో ఆడుతున్న దోబూచులాటకు జగన్ ఇప్పుడు తెరదించాడు. ప్రత్యేక హోదా పోరాటం అని చెప్పి చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి కనీసం మోడీ పేరు ప్రస్తావించే సాహసం కూడా చేయలేనప్పుడే జగన్ తీరు చాలా మందికి అర్థమైంది. ఇప్పుడు జగన్ తాజా వ్యాఖ్యలతో సాగిలపడే విషయంలో చంద్రబాబు, జగన్‌లు దొందూ దొందే అనే విషయం అందరికీ అర్థమైంది. ఇక ఈ రసవత్తర నాటకాన్ని నడిపిస్తున్న బిజెపి నాయకులకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాలు అస్సలు అవసరం లేదు. వెంకయ్యతో సహా అందరివీ కూడా రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన ఆలోచనలే. 2019లో కూడా మరోసారి మోసపు హామీలతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ఎలా మోసం చేయాలా అన్న రాజకీయ వ్యూహాలే. మరో నేత….ధైర్యానికి, నిజాయితీకీ కేర్ ఆఫ్ అడ్రస్…..ప్రజల కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉండే జనసేనుడు పవన్ తీరు మరీ కామెడీ. మోడీ, కెసీఆర్‌ల దగ్గర చంద్రబాబు ఎలా ఉంటాడో….ఈ పవర్ స్టార్ నాయకుడు చంద్రబాబు దగ్గర అలా ఉంటాడు.
ఇక భజన మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇలాంటి బానిస మనస్తత్వం ఉన్న నాయకులందరినీ వీరులు, శూరులు, బాహుబలులు అని చెప్పి ప్రజలను నమ్మించడానికి నానా పాట్లూ పడుతూ జర్నలిజం విలువలకు పాతరేస్తోంది. కులాల వారీగా జనాలను విడగొడుతూ ఆయా కుల జనులకు ఆయా కులాలకు చెందిన నాయకులను హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆ బాపతు జనాలందరూ కూడా సోషల్ మీడియాలో మా వాడు హీరో…..మీ వాడు బానిస అని చెప్పి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ అందరూ కలిసి రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేస్తున్నారన్న అసలు విషయాన్ని మర్చిపోతూ అమాయకంగా మోసపోతున్నారు. ఈ మొత్తం డ్రామాని నడిపించడంలో భజన మీడియా అంతా కూడా తమ వంతు బానిస పాత్ర పోషిస్తోంది. అందులో భాగమే ఈ కామెంట్లు, పలుకులు, వార్తా కథలు. నంబర్ ఒన్ పత్రికతో సహా అన్నింటిదీ అదే బాట…మాట.