హేతువాది బాబు గోగినేని మరొకసారి నాగబాబు పై విరుచుకుపడ్డారు. మొన్నీమధ్య పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డ తర్వాత ఒక అభిమాని విడుదల చేసిన ఫోటో పై చులకన భావంతో వ్యాఖ్యలు చేయడం ద్వారా గొడవను బాబు గోగినేని తానే మొదలుపెట్టారు. దానికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు దానిపై మరింత ఘాటుగా బాబు గోగినేని స్పందించారు. వివరాల్లోకి వెళితే..
మాటల యుద్ధం మొదలైన తీరు:
పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డట్టు వార్త వచ్చిన తర్వాత, ఓ అభిమాని, ఆ ఫొటో ఆధారంగా ఓ బొమ్మ గీశాడు. పవన్ పడుకుంటే, వివేకానందుడు, చెగోవేరా పవన్ ని పరామర్శిస్తున్నట్టు గీసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై వెటకారం చేస్తూ బాబు గోగినేని, ” 39 ఏళ్లకే చనిపోయిన వివేకానందుడు, అదే వయసులో చంపబడ్డ డాక్టర్ చే.. ఇద్దరూ రిస్క్ తీసుకుని మాస్క్ పెట్టుకోకుండా వస్తే, అభిమానుల కోసం చక్కగా తల దువ్వుకుని నలగని లుంగీలో డ్రెస్ అయ్యి, సెలైన్ ఎక్కించుకుంటున్న 49 ఏండ్ల యువ హీరోని పరామర్శించడం చాలా స్ఫూర్తి దాయకం..“ అంటూ కామెంట్ చేశారు. మెగా ఫ్యామిలీ మీద ఎవరు ఇలాంటి కామెంట్స్ చేసినా స్పందించే నాగబాబు , బాబు గోగినేని పై కూడా స్పందించారు. పరోక్షంగా ఆయన వ్యాఖ్యలపై మాట్లాడుతూ నేను పెంపుడు కుక్కలను మాత్రమే ఇష్టపడతాను అంటూ వ్యాఖ్యానించారు నాగబాబు. తమ కుటుంబంలోని వ్యక్తుల పై అవాకులు చవాకులు మాట్లాడే వారు ఊర కుక్కలు అని అర్థం వచ్చేలా చేసిన ఈ వ్యాఖ్యలు బాబు గోగినేని కి కూడా బాగా కోపం తెప్పించినట్లు ఉన్నాయి.
నాగబాబుకు తిరిగి కౌంటర్ ఇచ్చిన బాబు గోగినేని:
బాబు గోగినేని నాగబాబుపై కోపాన్ని వ్యక్తం చేస్తూ, గాంధీజీ హంతకుని, దేశభక్తుడు అన్న దుష్టుడు నాగబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి చుట్టూ పెంపుడు కుక్కలు మాత్రమే ఉంటాయి మనుషులు కాదు అన్నట్లు వ్యాఖ్యలు చేశారు గోగినేని. అంతే కాకుండా తన పైకి నాగబాబు ఉసిగొల్పిన ఇంటర్నెట్ కుక్కలని ఆయనే అదుపులో పెట్టాలని అంటూ బాబు గోగినేని హెచ్చరించారు.
కులగజ్జి తో నే బాబు గోగినేని వ్యాఖ్యలు అంటూ నెటిజన్ల విమర్శలు
మొత్తం మీద నాగబాబు, బాబు గోగినేని మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వ్యవహారంలో మొదటి రాయి విసిరింది మాత్రం హేతువాది అయిన బాబు గోగినేని యే. తనకు ఏమాత్రం సంబంధం లేని పవన్ కళ్యాణ్ విషయంలో తలదూర్చి, అనవసరంగా ఈ విషయంలో వేలు పెట్టడం వల్ల తన అభిమానుల నుండి ట్రోలింగ్ వస్తుందని తెలిసి కూడా వెటకారంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ మాటల యుద్ధానికి తెరలేపారు బాబు గోగినేని.
అయితే బాబు గోగినేని మెగా ఫ్యామిలీని తనకుతానుగా కెలకడం ఇది మొదటిసారి కాదు. గతంలో నిహారిక పెళ్లి సమయంలో బిబిసి తెలుగు వారు ఆ పెళ్లి గురించిన విశేషాలతో ఒక కథనాన్ని ప్రచురిస్తే, దాని మీద ఎంతో కడుపుమంటతో ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సామాజికంగా ఎటువంటి ప్రాధాన్యత లేని నిహారిక పెళ్లి విశేషాలను బీబిసి వారు ఎందుకు కవర్ చేశారు అంటూ అప్పట్లో ఆయన తీవ్రంగా ప్రశ్నించగా, అదే బిబిసి తెలుగువారు బాబు గోగినేని బిగ్ బాస్ ప్రోగ్రాం లో పాల్గొన్నప్పుడు బిగ్ బాస్ ప్రోగ్రాం పై విశేషాలతో కూడా కవర్ స్టోరీ చేశారని, మరి బిగ్ బాస్ ప్రోగ్రాం కు ఏమి సామాజిక ప్రాధాన్యత ఉందని అప్పుడు మీకు ఎందుకు అనిపించలేదు బాబు గోగినేని గారూ అంటూ అప్పట్లో నెటిజన్లు ఆయన ద్వంద ప్రమాణాలను ప్రశ్నించారు.
Click here: నిహారిక పెళ్లి కథనాలపై బాబు గోగినేని వ్యాఖ్యలు, హేతువాది కీ కుల పిచ్చి అంటూ విమర్శలు
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు ఇదే తరహాలో విమర్శలు చేస్తున్నారు. నిజమైన సమస్యలు తెలుగు రాష్ట్రాలలో చాలా ఉన్నాయని, వాటిపై స్పందించడం చేతకాక, కరోనాతో బాధపడుతున్న వ్యక్తిని ట్రోలింగ్ చేసే కుసంస్కారానికి బాబు గోగినేని వంటి హేతువాది పాల్పడడం సబబు కాదని, పైగా గతంలోనూ ఇప్పుడు రెండు సార్లు కూడా మెగా ఫ్యామిలీ తో జరిగిన మాటల యుద్ధం లో మొదటి రాయి బాబు గోగినేని వైపు నుండే రావడం చూస్తుంటే ఆయన మన ఏదో కారణంతో వీరి కుటుంబం పై కడుపు మంట పెంచుకున్నట్లు అర్థమవుతోందని వారు విమర్శిస్తున్నారు.
మరి బాబు గోగినేని ఈ మాటల యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తారా లేక నిజమైన సమస్యలపై మాట్లాడతారా అన్నది వేచి చూడాలి.