ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ జీవీఎల్ నరసింహారావులోని సెఫాలజిస్ట్ నిద్రలేస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరుగుతూంటే.. అక్కడ వాస్తవ పరిస్థితులును.. తన పరిమితుల మేర విశ్లేషించి.. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని తీర్మానించేస్తున్నారు. దానికి తనకు మాత్రమే… సాధ్యమైన విశ్లేషణలు చేస్తూంటారు. ఖండించడానికి పక్కన ఎవరూ చూడకుండా.. జాగ్రత్త పడతారు.. అది వేరే విషయం. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలతో పాటే.. జరుగుతాయని.. ఈసీ చెబుతోంది కానీ.. విస్త్రృత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుగానే నిర్వహించి.. ఫలితాలు పొందాలనేది.. “కాంబో” ప్లాన్‌లో భాగమని… చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.
సరే.. ముందు జరిగినా.. వెనక జరిగినా.. వాటితో పాటే జరిగినా.. ఆరు నెలల్లో మాత్రం ఎన్నికలు ఖాయం. అందుకే సెఫాలజిస్ట్ నరసింహారావు.. ఇప్పుడు పుల్ స్వింగ్‌లోకి వచ్చారు. ఆ నాలుగు రాష్ట్రాల గురించి ఏం విశ్లేషిస్తున్నారో కానీ… తెలంగాణలో మాత్రం.. గెలుపు బీజేపీదేనని… ప్రతీ రోజూ .. ఏదో ఓ మీడియాను పిలిపించుకుని.. చెబుతున్నారు. టీఆర్ఎస్తో కుమ్మక్కయి.. ముందస్తు ఎన్నికల నాటకం ఆడుతున్నారని.. విమర్శలు వస్తున్నా.. జీవీఎల్ పట్టించుకోవడం లేదు. సిట్టింగ్ సీట్లు గెలిపిస్తామని.. టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కూడా లైట్ తీసుకున్నారు. సిట్టింగ్ సీట్లు టీఆర్ఎస్ గెలిపించినా… మిగతా సీట్లు బీజేపీనే సొంతంగా గెలుచుకుంటుందన్న ధీమాను మాత్రం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల్నుంచి.. ఈ ఉత్సాహం మరింత పెరుగుతోంది. బీజేపీ తెలంగాణ లీడర్లు కూడా.. అంత కాన్ఫిడెంట్‌గా చెప్పరు.
కానీ జీవీఎల్ మాత్రం సెఫాలజిస్ట్ అనుభవాన్ని రంగరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటున్నారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నుంచి వలసలు.. కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువగా వెళ్తున్నాయి. అయితే.. అనూహ్యంగా బాబూమోహన్… బీజేపీలో చేరారు. ఆ ఉత్సాహంతో.. తమ గెలుపు ఖాయం చేసుకుంటున్నట్లుగా.. జీవీఎల్ తీరు ఉందన్న సెటైర్లు పడుతున్నాయి. ఆయనది రాజకీయ పార్టీ కాబట్టి… గెలవక ఓడిపోతామని చెబుతారా ఏమిటి..? అన్న డౌట్ రావొచ్చు కానీ.. మరీ ఈ స్థాయిలో చెబితే.. మాత్రం కామెడీ అయిపోతుంది. అది జీవీఎల్ మార్కేమో మరి..!