తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ టిక్కెట్ నిరాకరించిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకరు బాబూమోహన్. ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా… మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహపై గెలిచిన బాబూమోహన్ కు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో జర్నలిస్ట్ క్రాంతికిరణ్ కు అవకాశం కల్పించారు. ఈ విషయంపై బాబూమోహన్.. తన అసంతృప్తిని మీడియా సాక్షిగా వెల్లడించలేదు. కానీ.. ఆయనను కేసీఆర్ బుజ్జగించారని… పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి టిక్కెట్ ఇస్తామన్నారని.. కుదరకపోతే.. రాజ్యసభ సీటు ఇస్తామన్నారన్న ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా బాబూమోహన్… బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లి అమిత్ షా సమక్షంలో… బీజేపీ కండువా కప్పుకున్నారు. గులాబీ నేత నుంచి కాషాయ నేతగా మారిపోయారు.
టీఆర్ఎస్ లో తనకు టిక్కెట్ ఎందుకు నిరాకరించారో.. త్వరలో బయటపెడతానని బాబూమోహన్ ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో … హరీష్‌రావు ఫోన్ చేసి రమ్మంటేనే టీఆర్ఎస్లో చేరాననన్నారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్‌ను అడిగానని కానీ.. సమాధానం చెప్పలేదన్నారు. కేసీఆర్ ఫోన్ చేస్తారని కేటీఆర్ చెప్పినా… 20 రోజులు ఎదురు చూసినా ఫోన్ రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో…వివరాలు తర్వాత బయటపెడతానన్నారు.మోదీ, అమిత్ షా నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నానని పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధమని బాబు మోహన్ ప్రకటించారు.
బాబూమోహన్ చేరికతో తమ బలం మరింతగా పెరిగిందని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెబుతున్నారు. రాష్ట్రంలో ఏర్పడింది మహాకూటమి కాదు విషకూటమి అని విమర్శించారు. బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన బాబూమోహన్ ..ఆ తర్వాత లక్ష్మిపార్వతి పార్టీ తరపున కూడా పోటీ చేశారు. చివరికి టీడీపీ తరపున ఆందోల్ నుంచి గెలిచి ఓ సారి మంత్రి కూడా అయ్యారు. అవడానికి సినిమాల్లో కమెడియనే అయినా.. ఆయన రాజకీయాల్లో చాలా తేడాగా ప్రవర్తిస్తారనే విమర్శలు ఉన్నాయి. ఎవరితోనూ సన్నిహితంగా ఉండకపోవడం.. అందరితోనూ గొడవలు పెట్టుకోవడం బాబూమోహన్ స్టైల్ అంటూంటారు. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు..కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కు బోలెడంత మంది నేతలున్నారు. అదే బాబూమోహన్ కు మైనస్ అయింది.