బాబూమోహన్ కుమారుడు ఉదయ్ ఆయనకు షాకిచ్చారు. ఆయన అందోల్ లో బీజేపీ తరపున పోటీ చేస్తూంటే.. విజయం కోసం పని చేయాలని కొడుకు బీఆర్ఎస్ లో చేరిపోయాడు. సిద్దిపేటలో హరీష్ రావు సమక్షంలో అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీకి ఉన్న అరకొర క్యాడర్ లో కొంత మందిని తన వెంట తీసుకెళ్లిపోయాడు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని ఉదయ్ బాబూమోహన్ పిలుపునిచ్చాడు.
ఈ ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఉదయ్ ప్రయత్నించారు. బీజేపీ హైకమాండ్ కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలనుకుంది. కానీ బాబూమోహన్ ప్రెస్ మీట్ పెట్టి బెదిరిపులా మాట్లాడటం.. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తామంటున్నారని కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. బాబూమోహన్ కే టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆయన నామినేషన్ వేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ బాబూమోహన్ వ్యవహారశైలి వల్ల చాలామంది బీజేపీ నేతలు ఆయనకు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు కొడుకు కూడా దూరమయ్యాయి.
బాబూమోహన్ ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రమాదంలోలో చనిపోయారు. మరొకరితో ఆయనకు విబేధాలొచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తండ్రి పోటీలో ఉన్నప్పటికీ.. ఆయన బీఆర్ఎస్ లో చేరి.. తండ్రికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ తరపున 2014లో గెలిచిన బాబూమోహన్ కు.. 2018లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి ఆందోల్ నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ. ఆయన కేవరం రెండు వేల ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఈ సారి అవి కూడా తెచ్చుకుంటారో లేదోనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.