తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వున్నపుడు పరిపాలనకు ఒక వృత్తినైపుణ్యాన్ని (ప్రొఫెషనలిజాన్ని) జోడించిన చంద్రబాబు ఇపుడు పాలన పట్ల అధికారులు, మంత్రుల దృక్పధాల్లో(యాటిట్యూడ్స్) మార్పు తెచ్చే పనిపెట్టుకున్నారు. గ్లోబలీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు గరిష్టంగా ఉపయోగించుకునే స్ఫూర్తిని సహచరుల్లో నింపడమే. అలాంటి టీమ్ ని తయారు చేసుకోవడమే ముఖ్యమంత్రి ముందున్న ప్రయారిటీ టాస్క్. నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమేరకు సాధించారో తెలుసుకోడానికి ఆయన టెక్నాలజీతోముడిపడిన శాస్త్రీయ విధానాలు, పద్ధతులను ఆశ్రయించారు. ఇందులో చాలావరకూ పారదర్శకమైనవి. కొన్ని చంద్రబాబుకి మాత్రమే ఏక్సెస్ వుండే గోప్యమైనవి.
పదవిలో వుండటానికీ, వుండకపోవడానికీ ప్రాతిపదిక, పనితీరేతప్ప మరేమీకాదు అని ఈసారి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ చంద్రబాబు మంత్రులతో, ఎమ్మెల్యేలకు, అధికారులకు చెబుతూనే వున్నారు. అనేక సందర్భాల్లో వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కూ, టెక్నాలజీలు వుపయోగించే గాడ్జెట్లద్వారా, ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా ముఖ్యమంత్రి కి చేరే ఫీడ్ బ్యాక్ కూ చాలా తేడా వున్న సందర్భాలు అనేకం వున్నాయి.
జనాభిప్రాయంతెలుసుకోడానికి గోదావరి పుష్కరాల సమయంలో యువసాంకేతిక నిపుణులైన ముఖ్యమంత్రి బృందం చేసిన ఏర్పాటులో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. అధికారులు, మంత్రులు, జర్నలిస్టులు ఉహించిన శాఖలుకాక ఊహించని శాఖలే బాగా పని కేస్తున్నాయని ఫీడ్ బ్యాక్ అందింది. గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే అదేనిజమని తేలింది. ఇలా అనేక సందర్భాల్లో రియాలిటీలను చూపిస్తున్న ముఖ్యమంత్రి ఏడాదికాలంలో మంత్రులమీదా, అధికారుల మీదా అదుపుపెంచుకుంటూ వస్తున్నారు. వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా శాఖలవారీగా పనితీరు తరచు ప్రస్తావిస్తున్నారు. వెనుకబడిన శాఖలపట్ల మందలింపుల స్వరంలో కాఠిన్యం పెరుగుతోందని అధికారులు మంత్రులు కూడా ప్రయివేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.
ముఖ్యమంత్రి హెచ్చరికల తీవ్రతను బట్టి మార్పులు చేర్పులలతో మంత్రివర్గ పునర్యవస్ధీకరణకు టైము దగ్గరపడిందని అర్ధమౌతోంది. రెవిన్యూ , స్త్రీ శిశుసంక్షేమం, పంచాయతీ రాజ్, వైద్యఆరోగ్యం, దేవాదాయశాఖలపై మైనస్ మార్కులను ముఖ్యమంత్రి పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రకారం సీనియర్ సహచరుడైన ఉపమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు పీతల సుజాత, చింతకాయల అయ్యన్న పాత్రుడు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రెడ్ లిస్టులో వున్నారని అర్ధమౌతోంది. వీరిలో సొంతపార్టీకే చెందిన మొదటి ముగ్గురికీ పదవులు మార్చడానికి లేదా విశ్రాంతి ఇవ్వడానికి చంద్రబాబుకి పూర్తి స్వేచ్చవుంది.
మిత్రపక్షమైన బిజెపి వారైన కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుల విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రికి తేలికైన విషయంకాదు. అయితే పునర్వవస్ధీకరణలో వారిశాఖలను మార్చడం పెద్ద విషయమే కాదు. వీరుకాక విశాఖ ఎమ్మెల్యే రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు (రాజమండ్రి) బిజెపి వారే. ఈ ఇద్దరికి బదులు మిగిలిన ముగ్గురిలో ఇద్దరిని మార్పు చేసుకోవాలనుకున్నా బిజెపి అగ్రనాయకులైన జవదేకర్, వెంకయ్య నాయుడులతో చంద్రబాబు చర్చించవలసి వుంటుంది. తేనెతుట్టను కదిలించే పనికంటే శాఖలమార్పిడి అంత సునాయాసత ముఖ్యమంత్రికి వుండదు.
ముఖ్యమంత్రి భాష మాకుకూడా అర్ధమౌతోంది. ఆయన సమావేశాల్లో వుండే మంత్రులకు అర్ధకాలేదంటే వారు ఆపదవుల్లో వుండతగినవారు కాదని అర్ధం అని తెలుగదేశం సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఆయన అలాంటి సమావేశాల్లో వుండాలని ఉబలాటపడిపోతున్నారు.