ముఖ్యమంత్రుల సాక్షిగా ఎపి బాల్ ని ‘సెంటర్’ లో వేసిన సిఎం
సంకీర్ణ ప్రభుత్వాల్లో డిమాండ్ల సాధనకు భాగస్వామ్య పార్టీలు అమలుచేయవలసిన ఎత్తుగడలకు, బాధ్యతను ఫిక్స్ చేసే రాజకీయ ప్రక్రియకు అంతరాష్ట్ర మండలి సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేదికగా మలచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం చేసితీరవలసిన సహాయాలను,
నెరవేర్చవలసిన హామీలను అమలు చేసే ఉద్దేశం బిజెపికి లేదని ఇప్పటికే లెక్కతేలిపోయింది. బిజెపితో తెగతెంపులు చేసుకుని హక్కుల సాధనకు ఉద్యమించాలని ప్రత్యర్ధి రాజకీయపక్షాలు తెలుగుదేశానికి సలహా ఇస్తున్నాయి. చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయి రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఆయన మాత్రం ఘర్షణవైఖరి పాటించేదిలేదని, బిజెపి భాగస్వామ్యాన్ని వొదులుకునేది లేదని తెగేసి చెప్పేశారు.
అయితే తగిన సమయంలో తగిన వేదిక మీద మాట్లాడితే ఎంతోకొంత కదలిక వచ్చి తీరుతుంది. ప్రధాని అధ్యక్షతన అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు విన్నపాలు చేశారు… మనవి వినమన్నారు…చట్టాల్ని అమలు చేయాలని గుర్తుచేశారు. హామీలు మరువవద్దని హితవు చెప్పారు… గవర్నలను అడ్డంపెట్టుకుని ఇష్టారాజ్యాలు కుదరవన్నారు.
గవర్నర్లకు ఐదేళ్ల నిర్దిష్ట పదవీ కాల పరిమితి ఉండాలన్న జస్టిస్ ఎంఎం పూంఛి కమిషన్ సిఫార్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అన్నారు.
గవర్నర్లను ప్రజలుగానీ, ప్రజా ప్రతినిధులు గాని ఎన్నుకోరని, వారికి ఐదేళ్ల పదవీ కాలపరిమితిని నిర్దేశించడం అభిలషణీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ ఎంఎం పూంఛి కమిషన్ నిర్మాణాత్మకమైన సిఫారసులు చేసిందని చెబుతూనే కొన్ని సిఫార్సులు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగంలోని 61ఎ అధికరణ ప్రకారం గవర్నర్‌ను అభిశంసించవచ్చన్న సిఫారసు కూడా తమకు అంగీకారయోగ్యం కాదన్నారు.
అలాగే 355, 356 అధికరణల కింద రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ పేరిట కేంద్ర బలగాలను మోహరించేందుకు వీలు కల్పించే సిఫారసును కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనలో యుపిఏ ప్రభుత్వం ఏపికి తీరని అన్యాయం చేసిందనీ, ప్రస్తుత ఎన్డిఏ ప్రభుత్వం కూడా ఏపి సమస్యల పరిష్కారానికి కొన్ని చర్యలు మాత్రమే తీసుకుందనీ ఫిర్యాదు చేశారు. పొరుగు రాష్ట్రాల స్థాయికి ఎదగాలంటే ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆర్థిక సాయం అందించడంతోపాటు వౌలిక సదుపాయాల కల్పనకు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయనేది ఈ సమావేశంలో ఉన్న నాయకులందరికీ తెలుసు కాబట్టి ఏపికి ప్రత్యేక హోదాను అమలు చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని చంద్రబాబు విజప్తి చేశారు.
‘పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి.. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలి.. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి.. పారిశ్రామికీకరణను త్వరితగతిన సాధించేందుకు ప్రత్యేక పన్ను రాయితీలు కల్పించాలి.. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు మిగతా గ్రాంటును వెంటనే విడుదల చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
దిగువ రాష్టమ్రైన ఏపికి నీటిపారుదల విషయంలో కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి వాపోయారు. ఇంతవరకు గోదావరి, కృష్ణా నదీ నిర్వహణ బోర్డులను ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం అన్ని కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయినందున ఇలాంటి సంస్థలను ఏపిలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్రంలో గ్రే హౌండ్స్ శిక్షణ సంస్థ, ఏపి పోలీస్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకరించాలన్నారు.
ఇవన్నీ ప్రధానికి తెలిసిన విషయాలే! ఈ సమావేశంలో చెప్పడంవల్ల రాష్ట్రవిభజన వల్ల తలఎత్తిన సమస్యలు రెండేళ్ళ అనంతరం మొదటిసారిగా దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరికీ తెలిశాయి. పరిష్కారాలకోసం సమస్యల్ని వివరించే మోతాదు నిర్ణయించడంలో చంద్రబాబు పరిణతి సహచరముఖ్యమంత్రుల్లో ఆయన పట్ల ఆదరాబిమానాలను పెంచతుంది. తెలుగుదేశం జాతీయరాజకీయాల్లో చక్రం తిప్ిన పరిస్ధితికి చంద్రబాబు చూపిన లౌక్యమే ఒక ముఖ్యకారణం!
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు డిప్లమాటిక్ తెలివి చూపడానికి నిన్నటి సమావేశం వేదిక అయ్యింది. ఇంతమాత్రానికే కేంద్రం ఎపి అవసరాలను తీర్చేస్తుందికాదు. భవిష్యత్తు రాజకీయపునరేకీకరణల్లో చంద్రబాబు పట్టు తగ్గించాలంటే కేంద్రం ఎంతో కొంత ఎపికి మేలు చేయకతప్పదు. అలా జరగకపోతే బిజెపియేతర ముఖ్యమంత్రులను కూడగట్టడానికైనా ఈ సమావేశమే నాంది అవుతుంది.