‘బేబీ’.. గతేడాది విడుదలైన చిన్న సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని అందుకొంది. దర్శకుడు సాయి రాజేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు తను ఏ పెద్ద హీరోని కలిసినా, ఈజీగా కథ వింటాడు. డేట్లు ఇస్తాడు. ఆ నమ్మకాన్ని ‘బేబీ’ ఇచ్చింది. ఇన్నిచ్చిన ‘బేబీ’ ఈ దర్శకుడికి ఓ వింత అనుభవాన్నీ ఇచ్చింది.
సాయి రాజేష్‌కి ఓ స్నేహితుడు ఉన్నాడు. ఆయనకీ ఓ స్నేహితుడు ఉన్నాడు. ”మా ఫ్రెండ్ కి నీ సినిమా అంటే పిచ్చి.. కనీసం 50 సార్లయినా చూసి ఉంటాడు. నిన్ను వాళ్లింటికి భోజనానికి రమ్మన్నాడు. ఇన్నేళ్ల స్నేహంలో వాడేమీ అడగలేదు. నువ్వు కూడా కాదనకు” అంటూ ఆప్యాయంగా అడిగేసరికి సాయి రాజేష్… ఆ స్నేహితుడి, స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాడు.
సాయి రాజేష్‌ని సాదరంగా ఆహ్వానించింది ఆ కటుంబం. అంతే కాదు..”ఎంత గొప్ప సినిమా తీశారు సార్” అంటూ చీటికీ మాటికీ పొగిడీ, పొగిడీ… సాయి రాజేష్‌ని మునగ చెట్టు ఎక్కించేశారు. అంతేకాదు. బోలెడన్ని సెల్ఫీలూ, కబుర్లు. ఈలోగా గారెలూ, నాటుకోడి వచ్చేశాయి. వాటిని ఆరగించేలోగా.. ”సమంత అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. ఆమెతో ఒక్క ఫొటో తీయించండి. మళ్లీ.. సమంతతో సినిమా ఎప్పుడు సార్” అనగానే గతుక్కుమన్నాడు సాయి రాజేష్. వాళ్లు 50సార్లు పిచ్చి పిచ్చిగా చూసిన సినిమా ‘ఓ బేబీ’. సాయి రాజేష్ తీసిన సినిమా ‘బేబీ’. అక్కడ వాళ్లు కన్ఫ్యూజ్ అయి, సాయి రాజేష్‌కి కన్ఫ్యూజ్ చేశారు. ఇంత జరిగినా గారెలూ, నాటు కోడి వదల్లేదని తన ఇన్‌స్టాలో సరదాగా రాసుకొచ్చారు సాయి రాజేష్. టైటిల్ విషయంలో జరిగిన కన్ఫ్యూజన్ వల్ల ఈ దర్శకుడికి ఈ వింత అనుభవం ఎదురైంది. ఏదైతే అయ్యింది. చక్కటి విందు అయితే దొరికిందంటూ ఆ సరదా సంఘటన పంచుకొన్నారు. స్పోర్టింగ్ స్పిరిట్ అంటే అలా ఉండాలి మరి. కాకపోతే… ఈ దర్శకుడు తీసింది ‘ఓ బేబీ’ కాదని ‘బేబీ’ అని తెలిసిన ఆ ఫ్రెండు వాళ్ల ఫ్రెండు ముఖచిత్రమేమిటో చెప్పలేదు.