Baby movie review
రేటింగ్: 2.75/5
ఒక చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే అందులో నుంచి ఏదో కంటెంట్ వైరల్ కావాలి. ‘బేబీ’ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి కారణం అదే. ఇందులో ‘ఓ రెండు ప్రేమ మేఘాలై’ పాట యూట్యూబ్ ని షేక్ చేసింది. ఎక్కడ విన్నా ఇదే పాట వినిపించింది. ఆనంద్ దేవరకొండ హీరో కావడం, కలర్ ఫోటో చిత్రానికి రచయితగా, షో రన్నర్ గా చేసిన సాయి రాజేష్ దర్శకుడు కావడం, ట్రైలర్ కూడా యూత్ కి కనెక్ట్ అవ్వడంతో ‘బేబీ’ చుట్టూ బజ్ ఏర్పడింది. ట్రైలర్ చూస్తే ఇదొక టీజన్ లవ్ స్టొరీ అనిపించింది. మరా ప్రేమకథ ఎలా సాగింది ? బేబీ కథ ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉందా ?
ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) బస్తీ కుర్రాడు. అదే బస్తీలో తన ఎదురింటిలో వుంటుంది వైష్ణవి(వైష్ణవి చైతన్య). ఇద్దరిదీ ఒకటే స్కూల్. పదో తరగతి నుంచే ఆనంద్, వైష్ణవి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఐతే ఆనంద్ టెన్త్ తప్పి అటో నడుపుతుంటాడు. వైష్ణవి ఇంటర్ పాసై ఇంజనీరింగ్ లో చేరుతుంది. అప్పటి వరకూ హాయిగా వున్న ఆనంద్, వైష్ణవి ల ప్రేమ.. ఇంజనీరింగ్ లో వైష్ణవి కొత్త పరిచయాలు కారణంగా బీటలు వారుతుంది. అక్కడ చదువుకొనే పెద్దింటి కుర్రాడు విరాజ్ (విరాజ్ అశ్విన్) వైష్ణవి కి దగ్గరౌతాడు. వైష్ణవికి ఖరీదైన గిఫ్ట్ లు కొనిస్తాడు. వైష్ణవి కూడా తన రూపురేఖలని పూర్తిగా మార్చుకొని అల్ట్రా మోడరన్ గా తయారౌతుంది. ఈ క్రమంలో ఆనంద్, వైష్ణవి కి చిన్న గొడవ కూడా జరుగుతుంది. వైష్ణవి వేషధారణ చూసి అమెని ఓ అసభ్య పదంతో తిడతాడు ఆనంద్. దీంతో వైష్ణవి మనసు నొచ్చుకుంటుంది. ఒక రోజు అనుకోని పరిస్థితిలో విరాజ్ ని ముద్దు పెట్టుకుంటుంది వైష్ణవి. దిని తర్వాత ఏం జరిగింది? ఆనంద్ తో ప్రేమని కొనసాగించిందా? విరాజ్ కి దగ్గరైయిందా? విరాజ్ ని ముద్దు పెట్టుకున్న సంగతి ఆనంద్ కి తెలిసిందా? చివరికి బేబీ ప్రేమ ఏమైయింది? అనేది కథ.
‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి వుంటుంది’ బేబీ సినిమా చివర్లో వేసిన డైరెక్టర్ నోట్ ఇది. ఐతే ఈ వాక్యంలో ఉన్నంత ఎమోషన్, ఫీల్.. తెరపై కూడా తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు దర్శకుడు. తొలిప్రేమ అనేది ఎప్పటికీ ఓ మధురజ్ఞాపకమే. నిజంగా అది శాశ్వతంగా గుర్తుపెట్టుకునేది. బేబీలో ప్రేమని ముగ్గురి కోణాల్లో చూపించిన దర్శకుడు.. ఆనంద్ ప్రేమకథలో మాత్రమే నిజాయతీ ఆవిష్కరించగలిగాడు. మిగిలిన ఇద్దరి ప్రేమల్లోనూ స్వార్థం, లస్ట్ మాత్రమే కనిపిస్తాయి.
మందుకి బానిసైపోయిన ఆనంద్ తన గతాన్ని గుర్తు చేసుకోవడంతో కథ మొదలౌతుంది. స్కూల్ లో ఆనంద్, వైష్ణవి ల పరిచయం, ప్రేమ ఇవన్నీ మాంటేజస్ గా చకచకగా తీసుకెళ్ళారు. ఆనంద్, వైష్ణవి ల మధ్య ప్రేమ పుట్టడం కూడా ఆ వయసుకు తగ్గట్టే వుంటుంది. క్లాస్ లో అమ్మాయిలందరూ అబ్బాయిలకి రాఖీలు కట్టాలని ఆర్డర్ వేస్తాడు మాస్టర్. వైష్ణవి దెబ్బలు తింటుంది కానీ ఆనంద్ కి రాఖీ కట్టదు. కందిపోయిన వైష్ణవి చేయి చూసి ‘నన్ను కూడా ప్రేమించనివ్వు’ అంటాడు ఆనంద్. ఆ వయసులో ప్రేమ పుట్టాడానికి ఇంతకంటే పెద్ద కారణం అక్కర్లేదు.( పెన్సిల్ చెక్కడానికి షార్ఫ్ నర్ ఇవ్వగానే పుట్టేసే ప్రేమలు క్లాస్ రూమ్ అనుభవంలో వున్నవే). ఆనంద్ టెన్త్ ఫెయిల్ కావడం, వైష్ణవి ఇంజనీరింగ్ లో అడుగుపెట్టడం వరకూ.. స్లో మాంటేజులతో ఓ రెండు మేఘాలు పాటని నేపధ్య సంగీతంగా వాడి ఇద్దరి ప్రేమలోని కొన్ని మూమెంట్స్ ని అలా చూపించుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఐతే వైష్ణవి ఒక్కసారిగా కాలేజీలోఅడుగుపెట్టిన తర్వాత ఇది ఒక రొటీన్ ఫార్ములా ట్రాక్ లో నడుస్తుంది. విరాజ్ పాత్ర ఎంటర్ కావడం, వైష్ణవి పాష్ గా మారడం, కొత్త స్నేహాలు, అలవాట్లు ఇవన్నీ రొటీన్ గా వుంటాయి. ఐతే వైష్ణవి వేషధారణ విషయంలో ఆనంద్ అభ్యంతరం చెప్పే సన్నివేశం, తర్వాత వచ్చిన విరామం ఘట్టం .. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ కుర్రాళ్లకు నచ్చేస్తుంది. ఆ సీన్ తరవాత… ఓ మంచి సినిమా చూస్తున్నాం.. అనే ఫీల్ తో విరామం తీసుకొంటాడు ప్రేక్షకుడు.
ఐతే సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి బేబీలో అసలు సమస్య మొదలౌతుంది. ఈ ప్రేమకథలో చెప్పడానికి కొత్త అంశం, కోణం అంటూ ఏదీ వుండదు. ఇక్కడ నుంచి ప్రీక్లైమాక్స్ వరకూ వచ్చే సీన్లు ప్రేక్షకుల్లో అంతగా ఇంపాక్ట్ కలిగించవు. కొన్ని సీన్లు.. బాగా మొదలెట్టినా, సుదీర్ఘంగా సాగే సరికి.. అవి తేలిపోయాయి. అవి కూడా ఇప్పటి యువత మైండ్ సెట్ కి అద్దం పట్టేలా ఏం వుండవు. దీనికి కారణం ఈ కథని ముందుకు నడిపిస్తున్న వైష్ణవి పాత్రని క్లారిటీ లేకుండా తీర్చిదిద్దాడు దర్శకుడు. ‘ఆది’ సినిమాలో ఎల్బీ శ్రీరాం పాపులర్ డైలాగ్ డిక్షన్ లో.. ఒకసారి ప్రేమిస్తానని చెబుతుంది, మరోసారి లేదని అంటుంది. నువ్వుంటే ఇష్టం అంటుంది. మరొకరితో వుంటానంటుంది. ఏం అర్ధం కాకుండా బిహేవ్ చేస్తుంది’’ ఈ టైపులో వుంటుంది ఆ క్యారెక్టర్.
నిజానికి ఇదొక టీనేజ్ క్యారెక్టర్ అనుకుందాం. ఆ వయసులో అన్ని తెలివితేటలు వుండవనే భావిద్దాం. కానీ ఆ పాత్ర ప్రవర్తించే తీరు అలా వుండదు. ఒకొక్కసారి ప్రేమలో జీవితంలో తలపండిన మనిషిలా మాట్లాడుతుంది. మరోసారి పులిహోర బ్యాచ్ టైపు కనిపిస్తుంది. దీంతో ఆమె ఎమోషన్ కి ఆమె ఎదుర్కునే సమస్యలకు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. తర్వాత విరాజ్ పాత్రని కూడా ఇలానే తాడుబొంగరం లేకుండా ట్రీట్ చేశారు. ఆ పాత్ర కూడా అంతే. కాసేపు ప్రేమ అంటాడు ఇంకాసేపు ఫిజికల్ అంటాడు. మొత్తానికి అదొక గోల కింద తయారైయింది. దీంతో పాటు ఆ వీడియో రికార్డింగులు, బ్లాక్ మెయిల్లు, లొంగదీసుకోవడాలు .. పరమరొటీన్ వ్యవహారాలు.
ఇలాంటి కథలకు ముగింపు ఇవ్వడం సవాలే. ఈ విషయంలో దర్శకుడు కూడా పెద్ద కసరత్తు చేయలేదు. గుర్తుపెట్టుకునే ముగింపు ఐతే కాదు. నిజానికి ఈ కథకు వైష్ణవి పాత్రని ముగించడమే సరైన ముగింపు అనుకోని ఓ సన్నివేశం వేశాడు దర్శకుడు. కానీ ధైర్యం చేయలేకపోయాడు. మళ్ళీ ఆ పాత్రని కొనసాగించి అందరూ రాజీపడిపోయే ఒక కంఫర్ట్ బుల్ ఎండింగ్ ఇచ్చుకున్నాడు. దీంతో ఫోటో చూసుకుని జీవితాంతం మురిసిపోయే ఓ ఆటోవాల ప్రేమకథగా బేబీ ముగిసిపోయింది.
ఆనంద్ దేవరకొండ నటుడిగా ఒక మెట్టు ఎక్కాడు. నిజంగా తనలో నటుడిని పరిచయం చేసింది ఈ సినిమా. ఆనంద్ పాత్రని దాటి బయటికి రాలేదు. చివర్లో వచ్చే సన్నివేశాల్లో ఆనంద్ నటన వావ్ అనిపిస్తుంది. ‘నా పిల్లరా’.. అని ఏడుస్తుంటే.. ఆ వయసులో ఓ ప్రేమికుడి రియల్ పెయిన్ కనిపిస్తుంది. వైష్ణవి పాత్రలో చేసిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. ఆమెకు ఇది మొదటి సినిమా అంటే నమ్మబుద్ది కాదు. ఆమె ప్రజన్స్ బావుంది. కెమరా ఫియర్ లేదు. చాలా చలాకీగా హుషారుగా నటించింది. తన పేరు కొంతకాలం తెలుగు ఇండస్ట్రీలో నానుతుంది. ఐతే దర్శకుడు ఆమె పాత్రని ఒకదశలో అయోమయం చేసేశాడు. దీంతో క్యారెక్టర్ లో ఒక ఫ్లో వుండదు. చాలా చోట్ల సీన్ లో ఎమోషన్ ని పట్టుకోలేదు. ఇది డైరెక్టర్ తప్పిదమే. ఆనంద్ ఇచ్చిన చీరకట్టుకొని విరాజ్ దగ్గరికి వెళ్ళే సీన్ లో వైష్ణవి మొహంలో కాస్త పశ్చాత్తాపం కనిపించాలి. ఆమె అంతగా ప్రేమిస్తున్నాని చెప్పినపుడు తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ కలగాలి. కానీ ఆ సీన్ ని చాలా క్యుజువల్ గా తీసిపారేశాడు దర్శకుడు. దీంతో వైష్ణవి పాత్రే క్యారెక్టర్ లెస్ అనుకునే ప్రమాదంలో పడిపోయింది. విరాజ్ పాత్రకు తగ్గ నటుడే కానీ ఆ పాత్రలో కూడా క్లారిటీ లేదు. తన స్క్రీన్ ప్రజన్స్ మాత్రం బావుంది. నాగబాబు పాత్రని సరిగ్గా వాడుకోలేదు. హర్ష రెండు సీన్లకు పరిమితమయ్యాడు, మిగతా నటులు పరిధిమేర చేశారు.
విజయ్ బుల్గానిన్ సంగీతంలో ‘ఓ రెండు మేఘాలు’ సినిమా అంతా వినిపిస్తుంది. నేపధ్య సంగీతం కూడా అదే. ఒకసారి వైలెన్ లో ఒకసారి పియానోలో ఒకసారి స్ట్రింగ్స్ లో ఇలా ప్రతి సౌండ్ లో దాన్ని బిట్లు కింద విడగొట్టి వాడుకున్నారు. కెమెరా పనితనం నీట్ గా వుంది. సినిమా నిడివి మాత్రం సహనానికి పరీక్షపెడుతుంది. ఈ విషయంలో పూర్తి భాద్యత దర్శకుడిదే. చెప్పడానికి కొత్త విషయం లేనిప్పుడు ఎంత త్వరగా ముగిస్తే అంత మంచింది. కానీ ఇందులో అల జరగలేదు. చివర్లో ఇంకా ఎదో అద్భతం వుందని భావిస్తూ సాగదీసుకుంటూ వెళ్ళారు. మనసు పెడితే అరగంట సినిమాని కత్తిరించేవచ్చు. డైలాగ్స్ కొన్ని బావున్నాయి కానీ మరికొన్ని చిరాకు తెప్పిస్తాయి. మాటలు ఎక్కువైపోయాయి. ప్రతి పాత్ర ప్రేమ గురించి లెక్చర్స్ దంచేస్తుంది. చాలా మాటలు కుత్రిమంగా వుంటాయి.
ఐతే దర్శకుడు ఒక విషయంలో క్లారిటీగా ఉన్నాడనిపించింది. తన టార్గెట్ ఆడియన్స్ టీనేజర్స్. వాళ్ళకు రీచ్ అయ్యేలానే ఇందులో సీన్లు అల్లుకుంటూ వెళ్ళాడు. టీనేజ్ వయసులో ఓ సగటు అమ్మాయి ప్రేమ పట్ల, ఆకర్షణ పట్ల, విలాసాల పట్ల పడే గందరగోళాన్ని ఈతరానికి అర్థమయ్యేలా, కనెక్ట్ అయ్యేలా చెప్పగలిగాడు. ఓ రకంగా ఇది ఆటోవాలా ఆటో బయోగ్రఫీ అయినా, ఓ అమ్మాయి ఆత్మ కథలా కూడా కనిపిస్తుంది. ఒకర్ని మోసం చేయాలనుకొంటే ఫర్లేదు, మనల్ని మనం మోసం చేసుకొంటేనే జీవితం నాశనం అయిపోతుంది అనే ఓ చిన్న పాయింట్ ని అమ్మాయిల కోణంలో చూపించి – అబ్బాయిల మనసుల్ని గెలుచుకొన్నాడు దర్శకుడు.
రేటింగ్: 2.75/5