ఈరోజు నుండి తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. కొద్ది సేపటి క్రితం ముగిసిన బిజినాస్ అడ్వయిజరీ కమిటీ (బి.ఏ.సి)లో ఈనెల 29నుండి అక్టోబర్ 10వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అక్టోబర్ 2,3,4 తేదీలలో శాసనసభ శలవులుగా నిర్ణయించారు. సమావేశాలను కనీసం రెండు వారాలు నిర్వహించాలని ప్రతిపక్షాల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ అవసరమయితే బి.ఏ.సి.సమావేశం మరొకమారు నిర్వహించి సమావేశాలను మరో ఐదు రోజులు పొడిగించుకొందామని హామీ ఇవ్వడంతో ప్రతిపక్షాలు కూడా సంతృప్తి చెందాయి. శాసనసభ సమావేశాలలో మొదటిరోజయిన ఈరోజు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాంకి సభ్యులు ఘనంగా నివాళులు అర్పించిన తరువాత డి.ఆర్.డి.ఏ.సంస్థకి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం శాసనసభ 29వ తేదీకి వాయిదావేశారు.