ఈరోజుల్లో ఓ సినిమా తీయడం కాదు, దాన్ని మంచి రేటుకు అమ్మడం నిర్మాతలకు తలకు మించిన పనైపోతోంది. శాటిలైట్, ఓటీటీ హక్కులు అంత త్వరగా అమ్ముడుపోవడం లేదు. విడుదలకు ముందు సినిమా అమ్మేసి, నిర్మాత సేఫ్ అయిపోవడం కంటే గొప్ప అదృష్టం, అంతకు మించిన విజయం లేదు. మరీ ముఖ్యంగా మధ్య తరగతి సినిమాలకు ఇది చాలా ముఖ్యం. ఈ విషయంలో.. ‘బచ్చలమల్లి’దే అదృష్టం. నరేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. డిసెంబరు 20న విడుదల చేద్దామనుకొంటున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసింది. ఓటీటీ, థియేట్రికల్, శాటిలైట్, ఆడియో.. ఇలా రైట్స్ అన్ని అమ్మేశారు. దాదాపు రూ.15 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. రైట్స్ అన్నీ కలుపుకొంటే రూ.16 కోట్లు వచ్చాయి. అంటే విడుదలకు ముందే నిర్మాత టేబుల్ ప్రాఫిట్ చూశాడన్నమాట.
‘బచ్చలమల్లి’ ఫస్ట్ లుక్ పోస్టర్ పడగానే ఆసక్తి మొదలైంది. నరేష్ ని ఈ తరహా గెటప్‌లో చూడలేదు. గ్లింప్స్ కూడా మార్కెట్ దృష్టిలో పడింది. హాస్య మూవీస్ సంస్థ నుంచి వరుసగా మంచి సినిమాలే వస్తున్నాయి. నిర్మాత రాజేష్ దండా కూడా కథల్ని ఆచి తూచి ఎంచుకొంటున్నారు. సామజవరగమన, ఊరి పేరు భైరవకోన, ఇట్లు మారేడుమిల్లి నియోజక వర్గం ఇలా అన్నీ డీసెంట్ సినిమాలు తీశారు. అందుకే.. బచ్చలమల్లి కి మార్కెట్ పరంగా ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. డిసెంబరు 20 కూడా మంచి డేటే. ఆ రోజున ‘గేమ్ ఛేంజర్’ రావాల్సివుంది. అది వాయిదా పడడంతో స్లాట్ ఖాళీగా దొరికింది. త్వరలోనే టీజర్ విడుదల చేసి ప్రమోషన్ల స్పీడు పెంచాలని నిర్మాత రాజేష్ దండా భావిస్తున్నారు.