bachhala malli movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
నాందితో నరేష్ ప్రయాణం మారిపోయింది. కామెడీ సినిమాల్ని పక్కన పెట్టాడు. సీరియస్ కథలవైపు దృష్టి నిలిపాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని సినిమాలు ఆడుతున్నాయి. ఇంకొన్ని పక్కదారి పడుతున్నాయి. కానీ నటుడిగా నరేష్‌కు మాత్రం మంచి మార్కులు దక్కుతున్నాయి. ఈ ప్రయాణంలో తాను ప్రయత్నించిన మరో కొత్త క్యారెక్టర్ `బచ్చలమల్లి`. అణువణువు, అడుగడుగూ మూర్ఖత్వం నింపుకొన్న ఓ వ్యక్తి కథ ఇది. క్యారెక్టర్ పరంగా నరేష్‌కు కొత్త ప్రయత్నం అనే సంగతి టైటిల్, టీజర్, ట్రైలర్లతో అర్థమవుతోంది. మరి.. సినిమాగా ఎలా వుంది? ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపించిందా, లేదా?
బచ్చలమల్లి (నరేష్)కి తన తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రికీ కొడుకు అంటే ప్రేమ. అయితే రెండో పెళ్లి చేసుకొని, తన తల్లికి అన్యాయం చేశాడని, క్లిష్టమైన పరిస్థితుల్లో తనని వదిలి వెళ్లిపోయాడని తండ్రిపై కోపం పెంచుకొంటాడు మల్లి. ఆ కోపం పగగా మారుతుంది. మల్లి చదువు మానేసి, తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకొంటాడు. తాగుడుకి బానిస అవుతాడు. సిగరెట్లు మామూలే. లేని చెడు అలవాటంటూ లేదు. అన్నింటికి మించి మూర్ఖత్వం మీటర్ దాటుతుంటుంది. ఇలాంటి మల్లి.. కావేరీ (అమృత అయ్యర్)ని ఇష్టపడతాడు. తన కోసం చెడు అలవాట్లన్నీ మానేస్తాడు. జీవితంలో అన్నీ చక్కబడుతున్నాయి అనుకొన్న దశలో మళ్లీ మూర్ఖత్వం కోరలు చాపుతుంది. అలాంటప్పుడు ఏమైంది? మల్లి మళ్లీ తప్పుడు దారి పట్టాడా? మళ్లీ తన జీవితాన్ని చేచేతులా ఎలా నాశనం చేసుకొన్నాడు? అనేది మిగిలిన కథ.
జీవితం అన్నాక పట్టు, విడుపులు ఉండాలి. బంధాలు, అనుబంధాలు నిలవాలంటే కోపాలు, ప్రతీకారాలు పక్కన పెట్టాలి. లేదంటే చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సివస్తుంది. బచ్చలమల్లి జీవితంలో జరిగేది అదే. ఇదో క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. ప్రతీ సీన్లోనూ బచ్చలమల్లి క్యారెక్టరైజేషనే కనిపిస్తుంది. అయితే దాని మాటున కథేమైంది? అని అడిగితే అదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. సీన్ నెంబర్ వన్ నుంచి.. సీన్ నెంబర్ 60 వరకూ దర్శకుడు రాసుకొన్నది హీరో క్యారెక్టరైజేషనే. తన కోపం, తన పంతం, తన మూర్ఖత్వం ఇదే ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తూపోతుంది. మల్లి బాల్యం, తండ్రిపై కోపం, జీవితాన్ని నాశనం చేసుకోవడం.. ఇవన్నీ సీన్ బై సీన్ పేర్చుకొంటూ వెళ్లాడు దర్శకుడు. లవ్ స్టోరీ వచ్చాక.. కాస్త ట్రాక్ మారుతుంది. అయితే ఆ లవ్ స్టోరీ చాలా రెగ్యులర్ గా ఉంటుంది. ఇంత మూర్ఖుడ్ని ఓ అమ్మాయి ఇట్టే ప్రేమించేసిందేంటబ్బా? అనిపిస్తుంది. మల్లిలో మార్పు కూడా అంతగా అతికినట్టు అనిపించదు. ‘ఎవరి కోసం మారాలి? ఎందుకు మారాలి’ అనే ట్యాగ్ లైన్‌తో బతికే మల్లిగాడు.. ఓ అమ్మాయి ‘చెడు అలవాట్లన్నీ మానేయ్’ అంటూ మరో ఆలోచన లేకుండా మానేస్తాడు. ‘అమ్మాయి కోసమైనా ఎందుకు మారాలి?’ అనుకోవడం కదా మల్లిగాడి క్యారెక్టర్. అలా అనుకొంటేనే కదా మల్లిగాడు మరింత స్ట్రాంగ్ గా నిలబడేది. చివర్లో తల్లి చెప్పే మాటలకు కూడా మల్లి కన్వెన్స్ అయిపోతాడు. ఆ లెక్చరేదో ముందే ఇస్తే ఇంత గొడవ జరిగేది కాదు కదా అనిపిస్తుంది.
తండ్రితో మల్లికి గొడవ. అది ఈ కథకు చాలా బలమైన ఎలిమెంట్. కానీ దాన్ని మరింత బాగా చెప్పాల్సిందేమో అనిపిస్తుంది. తండ్రి పాత్రని ఉదాత్తుడిగా తీర్చిదిద్దారు. అంత సాఫ్ట్ క్యారెక్టర్‌పై హీరో పగ పెంచుకోవడం ప్రేక్షకుల్లో హీరో పట్ల ప్రతికూల భావన తీసుకొస్తుంది. అలాంటప్పుడు కథలో కీలకమైన కాన్ఫ్లిక్ట్ కి ఆడియన్ ఎలా కనెక్ట్ అవుతాడు? ప్రేమకథలో, విలన్ దగ్గర సంఘర్షణ బలంగా లేదు. అసలు ఈ కథలో విలన్ ఎందుకున్నట్టు? ఉన్నా ఏం చేసినట్టు? అనే అనుమానం వస్తుంది. మూర్ఖత్వం బోర్డర్ దాటిన హీరో కథ ఇది. ఒక్కోసారి ఆ మూర్ఖత్వమే కొంప ముంచినట్టు అనిపిస్తుంది. హీరో పట్ల సింపతీ పోయి, కోపం వస్తుంది. అది ఏ సినిమాకైనా ప్రమాదమే. హీరోపై కోపం వస్తే… సంఘర్షణ నిలబడదు. ఈ ప్రమాదం బచ్చలమల్లికి ఎదురైంది.
అయితే కొన్ని చోట్ల దర్శకుడికి మార్కులు పడతాయి. పెళ్లిమండపం సీన్ దగ్గర్నుంచి కథలో ఎమోషన్ మొదలవుతుంది. రావు రమేష్ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లే సీన్, ప్రీ క్లైమాక్స్ లో రావురమేష్‌తో సంభాషణ ఇదంతా బాగా రాసుకొన్నాడు దర్శకుడు. క్లైమాక్స్ కూడా కదిలించేదే. చిన్నాన్న అనే బాండింగ్ చుట్టూ తీసిన సన్నివేశాలు బాగున్నాయి. ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ వస్తూ హరితేజ తలపై చేయి వేసి, ఆశీర్వదించిన సీన్ కూడా హృదయానికి హత్తుకొంటుంది. అయితే సినిమాకు ఈ దినుసులు సరిపోలేదు. గమ్యం క్లైమాక్స్ ఎమోషన్ కలిగించేదే. అదెప్పటికీ గుర్తుండిపోతుంది. కారణం.. నరేష్ అప్పటి వరకూ నవ్విస్తాడు. సడన్ గా ఏడ్పించేస్తాడు. అప్పటి వరకూ ఎంటర్టైన్మెంట్ చేసిన ఓ క్యారెక్టర్ సడన్ గా ఏడిపిస్తే.. హృదయం బరువెక్కిపోతుంది. మల్లి క్యారెక్టర్ అలాంటిది కాదు. ఓ దశలో తనపైనే ప్రేక్షకులకు కోపం వస్తుంది. అలాంటప్పుడు బలమైన ఎమోషన్‌తో కథ ముగించినా అంతగా హృదయాన్ని టచ్ చేయలేదు.
నరేష్‌కు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. మొదట్నుంచి చివరి వరకూ ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయాడు. తన కెరీర్లో టాప్ 3 పెర్ఫార్మ్సెన్సుల లిస్టు వేస్తే.. బచ్చలమల్లి అందులో స్థానం సంపాదించుకొంటుంది. నరేష్ తప్ప మరో పాత్ర మనకు రిజిస్టర్ అవ్వదు. ఆఖరికి హీరోయిన్ పాత్ర సైతం. అంతలా నరేష్ ఆక్రమించుకొన్నాడు. అమృతా అయ్యర్ సంప్రదాయబద్ధంగా కనిపించింది. రావు రమేష్ తనదైన మార్క్ నటన ప్రదర్శించాడు. ప్రవీణ్‌కి చాలాకాలం తరవాత వెరైటీ పాత్ర పడింది. తన డైలాగ్ డెలివరీ, మేనరిజం బాగున్నాయి. ప్రసాద్ బెహరా ఓ పాత్రలో కనిపించాడు. `వీడు పెద్ద పత్తి గింజ మరి..` అంటూ వైవా హర్ష ప్రసాద్ బెహరా పై పంచ్‌లేస్తే థియేటర్ ఘొల్లుమంది. ఎందుకంటే ఇటీవల ప్రసాద్ బెహరా ఓ కేసులో ఇరుక్కొని జైలుకెళ్లాడు. దాంతో ఈ డైలాగ్ రిలటీవ్గా అనిపించి ఉండొచ్చు. అత్యుత్ కుమార్ పాత్రని గంభీరంగా చూపించారు కానీ, సరిగా వాడుకోలేదు.
టెక్నికల్ గా బచ్చలమల్లి బాగుంది. నరేష్ గత సినిమాలతో పోలిస్తే క్వాలిటీ మేకింగ్ కనిపించింది. బాగా ఖర్చు పెట్టారు. పాటలు బాగున్నాయి. పూర్ణాచారి రాసిన విషాద గీతం భావయుక్తంగా సాగింది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం మెప్పిస్తాయి. దర్శకుడు సుబ్బు కథని కంటే క్యారెక్టరైజేషన్‌ని నమ్ముకొన్నాడు. అంత వరకూ బాగుంది. కానీ అందులో బలమైన సంఘర్షణ ఇమడ్చలేకపోయాడు. నరేష్‌లోని నటుడ్ని బచ్చలమల్లి సంతృప్తి పరిచి ఉండొచ్చు. కానీ రెండున్నర గంటల సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుడికి మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో నిరాశ పరుస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2.25/5