‘మనిషిలో బిపి, షుగర్, కొలెస్ట్రాల్ కొలవడానికి మిషన్లు వచ్చాయి. మూర్ఖత్వం కలవడానికి ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే అది నీ విషయంలో బోర్డర్ దాటేస్తుంది” ఇదీ బచ్చలమల్లిలో అల్లరి నరేష్ క్యారెక్టర్. సుబ్బు మంగాదేవి డైరెక్షన్లో నరేష్ చేస్తున్న సినిమా బచ్చలమల్లి. ఈ రోజు ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ఇదో క్యారెక్టర్ బేస్డ్ సినిమా. అల్లరి నరేష్ మూర్ఖత్వంతో కూడిన క్యారెక్టర్జేషన్ చుట్టూ కథ తిరుగుతుంది. బచ్చలమల్లి గురించి రావు రమేష్ ఇచ్చే పరిచయంతో ట్రైలర్ ఓపెన్ అయింది. బచ్చలమల్లి మొరటు మనిషి. ఎవరి మాట వినే టైప్ కాదు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. తన కోసం తనని తాను మార్చుకుంటాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. అలా వచ్చిన అమ్మాయి తన జీవితాన్ని మరో కోణంలో మార్చేస్తుంది. అది ఏంటనేది తెరపై చూడాలి.
ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాకి పెద్దపీట వేశారు. నరేష్ లుక్కు, క్యారెక్టర్ ఫ్రెష్ గా వున్నాయి. ఇంత మొరటుతనంతో కూడిన క్యారెక్టర్ నరేష్ ఇదివరకు చేయలేదు. నాంది, ఇట్లు మారేడుమిల్లి సినిమా తరహాలో ఇది ఒక సీరియస్ సబ్జెక్టు. తన మూర్ఖత్వంతో జీవితంలో ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాడు, ఏం కోల్పోయాడనేది అనేది కథాంశం. అచ్యుత్ రావు, రావు రమేష్ కీలక పాత్రలలో కనిపించారు. హీరోయిన్ అమృత కి కూడా మంచి స్కోప్ వుంది.
క్యారెక్టర్ డ్రివెన్ కథలు వర్క్ అవుట్ అవుతున్నాయి. ఇందులో నరేష్ క్యారెక్టర్ గనుక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సినిమా మంచి ఫలితాన్ని చూస్తుందని చెప్పడంలోసందేహం లేదు. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.