ఇప్పుడు కూడా గులాబీ పార్టీ పాలేరు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే గనుక.. తెలంగాణాలో వారి అప్రతిహత విజయ పరంపరకు ఎదురు లేదని నిరూపణ అయినట్లే. అధికారంలో ఉన్న తెరాస కు సహజంగా కొన్ని అనుకూల పవనాలు ఉన్నాయని, ప్రతి విజయం నేపధ్యంలో ఓడిపోయిన ప్రతిపక్షాలు బుకాయిస్తూనే ఉన్నాయి. కానీ, ఈ దఫా అలా కుదరక పోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలు అన్నీ విడివిడిగా కాదు, కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు సానుభూతి పుష్కలంగా ఉన్న ఒకే అభ్యర్థిని బలపరుస్తూ ఉండడం విశేషం. వీరు జాతకలిసిన తరవాత కూడా, తెరాస విజయం సాధిస్తే గనుక, ఇక వారి హవాను ఇప్పట్లో ఎవరు అడ్డుకోవడం అసాధ్యం అని నిరూపణ అయినట్లే.
పాలేరు లో రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో ఏర్పడిన ఖాళీ కి ఉప ఎన్నిక జరుగుతున్నా విషయం మనకు తెలుసు. ఈ ఎన్నికలో అయన భార్య సుచరిత ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేయాలని కాంగ్రెస్ తపన పడింది. కానీ, తెరాస వారికంటే ముందే తుమ్మల ను అభ్యర్థి గా బరిలోకి దించేసి, తొడ కొట్టింది. అయితే కనీసం మిగిలిన అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, సూచరితను గెలిపించాలన్న కాంగ్రెస్ సంకల్పానికి సిపిఎం గండి కొట్టినా, టీడీపీ సహకరిస్తున్నది.
పాలేరులో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో తీవ్రమైన తర్జన భర్జనల అనంతరం, పోటీ చేయరాదని, సుచరిత కు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకున్నది. అయితే దీనివల్ల కెసిఆర్ హవాను ఎదుర్కొనడానికి కాంగ్రెస్ తో మిలాఖత్ అయిందనే నిందను వారు భరించాల్సి ఉంటుంది. దానికి వారు సిద్ధపడ్డట్లే ఉంది. సిపిఎం మద్దతును కూడా రాబట్టుకోవడానికి ఏచూరి ద్వారా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాల్సి ఉంది.