హైదరాబాద్: ఇవాళ శంకుస్థాపన కార్యక్రమంతో చరిత్ర పునరావృతం కానుంది. అమరావతికి 1,800 సంవత్సరాల క్రితం కోల్పోయిన రాజధాని హోదా మళ్ళీ దక్కబోతోంది. అలనాడు శాతవాహన రాజులకు రాజధానిగా ఉన్న అమరావతి, పూర్వవైభవం సంతరించుకోవటానికి ఇవాళ్టి శంకుస్థాపన కార్యక్రమం శ్రీకారమవుతుంది. నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలలో విస్తరించి ఉన్న నాటి శాతవాహనుల రాజ్యానికి అమరావతి సుమారు 450 సంవత్సరాలపాటు(క్రీ.పూ.220 వరకు) రాజధానిగా ఉండేది. అద్భుతమైన చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక వారసత్వం ఉన్న ఈ అమరావతి ఇప్పుడు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు నవ్యాంధ్ర రాజధానిగా మారబోతోంది. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య రూపొందనున్న ఈ అమరావతికి ఆ రెండు నగరాల సామీప్యం మరింత విలువను తీసుకొస్తోంది. నాలుగు జాతీయ రహదారులు, ఒక జాతీయ జలమార్గం, గ్రాండ్ ట్రంక్ రైల్వే రూట్, వేగంగా విస్తరిస్తోన్న విమానాశ్రయం, ఒక ఓడరేవు సమీపంలో ఉండటం అమరావతికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్లోనే కాక ప్రపంచంలోనే విశిష్టమైన నగరాలలో ఒకటిగా అమరావతి మారనుంది.