వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు, న్యాయవ్యవస్థను కేంద్రంగా చేసుకుని, న్యాయవ్యవస్థను ముద్దాయిగా చిత్రీకరిస్తూ చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఆ పార్టీ అభిమానులు సమర్థిస్తూ ఉంటే, ఇతర పార్టీల అభిమానులతో పాటు తటస్థుల లో మెజారిటీ భాగం కూడా దీనిని విమర్శిస్తున్నారు. అయితే ఈ సమర్థన- విమర్శలతో పాటు మరికొన్ని కొత్త వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా న్యాయవ్యవస్థపై చేసిన ఆరోపణల పై కొందరు విశ్లేషకులు – జగన్ కి సంబంధించిన కేసులలో త్వరలోనే పురోగతి ఉండనుందని, ప్రత్యేకించి దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల పై ఉన్న కేసులను రాబోయే తొమ్మిది నెలల్లో విచారణ వేగవంతం చేయాలనే ప్రతిపాదనల కారణంగా, జగన్ కేసు కూడా అటో ఇటో తేలిపోతుందని, అందుచేతనే జగన్ న్యాయ వ్యవస్థ పై ఈ విమర్శల పర్వానికి తెర తీశారని అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ అభిమానులు, ఆ పార్టీ వకాల్తా పుచ్చుకునే మీడియా మాత్రం – జగన్ న్యాయవ్యవస్థపై గురిపెట్టి చాలా గొప్ప సాహసం చేస్తున్నాడు అని, ఆయన గొప్ప ధీరుడు అని, వ్యాసాలు రాస్తున్నారు.
అయితే జగన్ గొప్ప ధీరుడు కావడం కారణంగానే న్యాయ వ్యవస్థ పై పోరాటం మొదలు పెట్టాడు అన్న జగన్ మీడియా కథనాల పట్ల ప్రజలలో సానుకూల స్పందన రావడం లేదు. నిజంగా అంత ధీరుడే అయి ఉంటే, ప్రత్యేక హోదా కోసమో, ప్రజా ప్రయోజనాల కోసమో కేంద్రంతో పోరాడి ఉంటే ప్రజల్లో మరింత మైలేజ్ వచ్చి ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం కానీ, ప్రత్యక్షంగా ప్రజలతో ముడిపడిన వేరే ఏదైనా ప్రయోజనాల కోసం కానీ పోరాడకుండా, తనపై ఉన్న కేసులు విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవ్యవస్థపై పోరాడుతున్న కారణంగా, కేవలం కేసుల నుండి బయట పడే ఉద్దేశ్యంతోనో, లేదంటే కేసుల నుండి బయటపడలేని పక్షంలో కుట్రపూరితంగా తనను జైలుకు పంపించారని సానుభూతి పిండుకునే ఉద్దేశ్యంతోనో జగన్ న్యాయవ్యవస్థపై ఆరోపణల పర్వానికి తెర తీశారని మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
ఎలాగూ పోరాటం అంటూ జగన్ మొదలు పెట్టాడు కనుక కనీసం ఇప్పుడైనా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో నిజమైన పోరాటం చేస్తాడా, లేదంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ఎంపీలతో రాజీనామా చేయడం వంటి తూతూ మంత్రం చర్య లతో సరిపెడతారా అన్నది వేచి చూడాలి.