వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వరని బహిరంగంగా చెప్పుకుంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి.. కనీసం సీఎం జగన్ దగ్గరకు వెళ్లడానికి కూడా అవకాశం దక్కడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈబీసీ నేస్తం పథకానికి మీట నొక్కడానికి వచ్చిన సీఎం జగన్ కు స్వాగతం చెప్పడానికి కొంత మంది పార్టీనేతలను అనుమతించారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం అనుమతించలేదు. వాహనం పక్కనపెట్టి నడిచుకుంటూ వెళ్లాలని చెప్పారు. దీంతో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు.
నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు యత్నించినా బాలినేని శాంతించలేదు. సీఎం కార్యక్రమంలో పాల్గొనకుండానే తన అనుచరులతో ఆయన ఒంగోలు వెళ్లిపోయారు. ఈ పథకం మీట నొక్కే సమయంలో బాలినేని లేరు. ఇటీవల బాలినేనికి పూర్తిగా వైసీపీలో ప్రాధాన్యత పడిపోయింది. పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదని తెలియడంతో టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ ముందే చెప్పారని అంటున్నారు. అందుకే ఓ సారి తన భార్యకు..మరోసారి తన కొడుక్కి ఇస్తారని చెబుతున్నారు. ఎవరికి ఇస్తారన్నది మాత్రం స్పష్టత లేదు.
మరో వైపు ప్రకాశం జిల్లా నుంచే తన కుటుంబం నుంచే ఆయన మరో నేత నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. దీంతో బాలినేని వర్గీయులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ఇప్పుడు సీఎం దగ్గరకు కూడా కనీస గౌరవం లభించకపోవడంతో బాలినేని వర్గీయులు మండిపడుతున్నారు. గతంలో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారాలూ జరిగాయి. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.