కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ రాత మారడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిందంటూ లీకులు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలోనూ ఆయన పేరు ఖరారు అయిందని… ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని ఢిల్లీ నుంచి కబురు అందింది. అంతలోనే మళ్లీ బ్రేక్.
ఇలా పదవులు అందినట్టే అంది చేజారిపోతుండటంతో తనకు పెద్ద పదవే రాబోతుందని అద్దంకి ఆశాభావం వ్యక్తంచేశారు. ఖచ్చితంగా రాజ్యసభ లేదా లోక్ సభ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని కాన్ఫిడెంట్ గా కనిపించారు. రాజ్యసభకు ఇతరులను నామినేట్ చేయడంతో.. సీఎం రేవంత్ సహకారంతో లోక్ సభకు అద్దంకి పోటీ ఖాయంగా కనిపించింది. ఎస్సీ రిజర్డ్ వరంగల్ పార్లమెంట్ బరిలో అద్దంకి నిలుస్తారని ఆయన పోటీని ఈసారి ఎవరూ ఆపలేరని టాక్ నడిచింది. కట్ చేస్తే మళ్లీ బ్రేక్.
ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అద్దంకి పేరు చివరి వరకు వినిపించినా ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ కావడానికి పెద్ద మంత్రాంగం నడిచినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ నేతలే పసునూరి చేరికకు రెడ్ కార్పెట్ పరిచి అద్దంకి టికెట్ కు రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లు కనబడుతోంది. ఏదీ ఏమైనా కాంగ్రెస్ లో అత్యంత దురదృష్టవంతుడు అద్దంకి దయాకరే.