అల్లు అర్జున్ పక్కన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించిన హీరోయిన్ అనూ ఎమ్మాన్యుయేల్. పేరుకి స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నాయి గానీ సక్సెస్లు రావడం లేదు. పోనీ అమ్మాయి నటనకు పేరు వస్తుందా? అంటే.. అదీ లేదు. అందం ఎంత వున్నప్పటికీ అదృష్టం ఆవగింజ అంత కూడా వున్నట్టు లేదు. దాంతో స్టార్ హీరోయిన్ రేసులోకి వెళ్లాలనుకున్నా అమ్మాయి ఆశలు త్వరగా తీరేలా కనిపించడం లేదు. తెలుగులో అనూ ఎమ్మాన్యుయేల్ సంతకం చేసిన తొలి సినిమా ‘ఆక్సిజన్’. దానికంటే ముందు ‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ విడుదలయ్యాయి. రెండూ అనూకి మంచి పేరు తెచ్చాయి. తరవాత వచ్చిన ‘ఆక్సిజన్’ హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ ఫ్లాప్ ఆమెపై ఎఫెక్ట్ చూపించలేదు. ఆ తరవాత చేసిన ‘అజ్ఞాతవాసి’పై అనూ ఎమ్మాన్యుయేల్ పెద్ద ఆశలు పెట్టుకుంది. అది ఫ్లాప్ కావడంతో అమ్మాయి ఆశలకు గండి పడింది. నిరాశే ఎదురైంది. అది పోతే తరవాత అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లైనులో వుందనుకుంటే… నిన్న విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అంతకు మించి అనూ పాత్రకు ప్రాముఖ్యత లేదని విమర్శకులతో పాటు ప్రేక్షకులూ తేల్చేశారు. దీంతో మరోసారి నిరాశ ఎదురైంది. నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలపైనే అనూ ఆశలన్నీ. అవి హిట్టయితే కెరీర్ కంటిన్యూ అవుతుంది. లేదంటే అంతే సంగతులు.