గత కొంతకాలంగా డబ్బింగ్ సినిమాల పరిస్థితి ఏమాత్రం బాలేదు. బిచ్చగాడు మినహాయిస్తే… డబ్బులు సంపాదించుకొన్న డబ్బింగ్ బొమ్మ ఒక్కటీ కనిపించలేదు. బడా బడా తమిళ స్టార్లు కూడా డింకీలు కొడుతున్నారు. ఆఖరికి శ్రీదేవి సినిమా వచ్చినా… చూడం పొండి అనేస్తున్నారు తెలుగు జనాలు. ఈ యేడాది ఒక్క డబ్బింగ్ సినిమా కూడా సరిగా ఆడలేదు. అయితే ఈ సీజన్లో నాలుగు అనువాద చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విజయ్, విక్రమ్, విశాల్, విజయ్ అంటోనీల చిత్రాలు రంగంలోకి దిగుతున్నాయి. విజయ్ ‘అదిరింది’, విక్రమ్ ’10’, విశాల్ ‘డిటెక్టీవ్’ విజయ్ ఆంటోనీ ‘ఇంద్రసేన’ రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
తెలుగులో పవన్ కల్యాణ్స్థాయి తమిళంలో విజయ్‌ది. అయితే తెలుగులో తుపాకి మినహాయిస్తే హిట్టు సినిమా ఏం లేదు. అది కూడా ఓ మోస్తరు వసూళ్లనే సాధించింది. విజయ్ చేసిన పులి అయితే తెలుగులో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అపరిచితుడుతో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సాధించాడు విక్రమ్. ‘ఐ’ సినిమాకీ భారీ వసూళ్లు వచ్చాయి. అయితే.. అప్పటి నుంచీ విక్రమ్ జాతకం ఏమాత్రం బాలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఫ్లాపులు వరుస కడుతున్నాయి. విక్రమ్ నటించిన అనువాద చిత్రం ’10’ ఈ నెలలోనే విడుదల అవుతోంది. ఎప్పటిదో సినిమా ఇది. తమిళంలోనూ ఫ్లాపే. అయితే తెలుగులో సమంత ఫేమ్‌ని వాడుకోవాలన్న ఉద్దేశంతో విడుదల చేస్తున్నట్టు కనిపిస్తోంది. బిచ్చగాడుతో స్టార్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. తన తదుపరి సినిమా ‘ఇంద్రసేన’ విడుదలకు సిద్దమైంది. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. బిచ్చగాడు ప్రభావం నిర్మాతలపై ఇంకా ఉంది. అందుకే.. ఈ సినిమా కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక విశాల్ కి గత కొంతకాలంగా విజయాల్లేవు. తమిళంలోనూ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాజా చిత్రం ‘డిటెక్టీవ్’ తమిళంలో బాగానే ఆడింది. ఆ ఆశతోనే ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విక్రమ్, విజయ్, విశాల్, విజయ్ ఆంటోనీ… అందరి పేర్లూ ‘వి’తోనే మొదలయ్యాయి. మరి ఈసారైనా ‘వి’జయం వరిస్తుందేమో చూడాలి.