కింగ్ ఆఫ్ గుడ్ టైమ్ కు బ్యాడ్ టైమ్ మొదలైంది. యూబీ మద్యం కంపెనీ అధిపతిగా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేతగా విజయ్ మాల్యా సాగించిన జల్సాలకు ఫుల్ స్టాప్ పడబోతోంది. ఎందుకో ఇంత కాలం ఆయనపై అపారమైన మెతకవైఖరిని ఒలకబోసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఆయనకు బ్యాడ్ టైమ్ మొదలుకావడానికి కారణమైంది.
17 బ్యాంకుల కన్సార్టియానికి మాల్యా కంపెనీ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దాదాపు 7 వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంతగా ఆ కంపెనీని మాల్యా నిర్వాకం దెబ్బతీసింది. దీంతో తర్జనభర్జనలు పడ్డ తర్వాత కొన్ని బ్యాంకులు అతడిని ఉద్దేశ పూర్వక ఎగవేతదారుగా, అంటే విల్ ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించారు. అందరికీంటే ఎక్కువ సొమ్మును ఉదారంగా మాల్యాకు రుణమిచ్చిన ఎస్ బి ఐ మాత్రం ఎందుకో ఆ పని చేయలేదు. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ బ్యాంకుల చేతగాని తనంపై సీబీఐ చీఫ్ నిప్పులు చెరిగారు. మీ నిర్వాకం వల్లే బ్యాంకులు ఇలా తయారైనాయంటూ పలు బ్యాంలకు చైర్ పర్సన్లపై ఓ సమావేశంలో మండిపడ్డారు. మాల్యాపై సీబీఐకి ఫిర్యాదు చేయడానికి ఏ బ్యాంకూ ఎందుకు ముందు రాలేదని ఆయన ప్రశ్నించడంతో అంతా గతుక్కుమన్నారు.
అలా సీబీఐ చీఫ్ తలంటడంతో ఎస్ బి ఐ వారికి కొస్త బాధ్యత గుర్తుక వచ్చినట్టుంది. డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. మాల్యా నుంచి రుణం రికవరీ చేయాలంటే ముందు ఆయనను అరెస్టు చేయాలని, దేశం విడిచి వెళ్లకుండా ఆదేశించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్, సోమవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యునైటెడ్ స్పిరిట్ బోర్డ్ డైరెక్టర్ గా వైదొలగినందుకు ఆ కంపెనీని టేకోవర్ చేసిన యాజమాన్యం మాల్యాకు 75 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 515 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. ఆ డబ్బు తీసుకుని లండన్ కు చెక్కేద్దామని మాల్యా ప్లాన్ చేశాడు. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆ డబ్బును అతడు తాకడానికి వీల్లేదని ట్రిబ్యునల్ హుకుం జారీ చేసింది. సందరు కంపెనీ యాజమాన్యం ఆ డబ్బును అతడికి ఇవ్వ కూడదని ఆంక్షలు విధించింది. దీంతో జల్సారాయుడి లండన్ డ్రీమ్ కు బ్రేక్ పడింది.
విందులు వినోదాలు అమ్మాయిలతో జల్సాల్లో మునిగితేలే మాల్యాకు రుణం తీర్చాలనే ఉద్దేశం లేదని చాలా స్ఫష్టంగా తెలుస్తూనే ఉంది. ఇప్పటికీ చాలా కంపెనీలు ఆయన్ని విల్ ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించలేదు. సీబీఐ చీఫ్ తలంటక పోతే ఈమాత్రం చలనం కూడా వచ్చేది కాదేమో. మరోవైపు, మాల్యా బ్యాంకు లావాదేవీల్లో మోసాలు, మనీ లాండరిగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. రేపో మాపో అతడిని ప్రశ్నించే అవకాశం ఉంది. అతడు దేశం విడిచి పోవద్దని కూడా ఏదో ఒక కేసులో ఆదేశాలు వస్తే ఇక ఇక్కడ బుక్ అయినట్టే. అయితే ఆయన నుంచి డబ్బులు వసూలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. చేసిన నేరానికి జైలు శిక్ష పడుతుందేమో.