పాతకాలంలో ఓ సినిమా సీను రాయడానికి చాలా కసరత్తు జరిగిందని ఇలా చెబుతారు. ఓ ఇంటికి ఓ అతిథి వచ్చి తలుపు కొడతాడు. ఆ సమయానికి కథ ప్రకారం.. ఇంట్లోని ఇల్లాలు స్నానం చేస్తుంటుంది. ‘స్నానం చేస్తున్నా.. వచ్చేస్తున్నా’ అనే డైలాగు లోపలినుంచి వినిపిస్తుంది- అని రచయిత రాశాడు. కానీ దర్శకుడు ఒప్పుకోలేదుట! ‘స్నానం చేస్తున్నా’ అనే మాట ఆడగొంతుకతో వినిపిస్తే ప్రేక్షకుడి ఊహ స్నానమాడే ఆడదాని మీదకు మళ్లుతుంది. అతనిలో బూతు ఆలోచన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే.. డైలాగు మార్చాలి అన్నారుట. ‘వచ్చేస్తున్నా అన్నయ్యగారూ’ అని డైలాగు మార్పించి.. చూసే ప్రేక్షకుడికి ఆలోచనలో కూడా బూతుధోరణి రాకూడదని జాగ్రత్త తీసుకున్నారట. … ఇలాంటి విలువలన్నీ ఇప్పుడు పాతచింతకాయ పచ్చడి ధోరణి అయిపోయినట్లుగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఇప్పుడు ఎంతగా బూతును బహిరంగంగా స్ఫురింపజేయగలిగితే.. అంత గొప్ప టెక్నిక్ కింద లెక్క. సినిమాలలో అయితే పచ్చి బూతులనే కామెడీ అనే ఒక ట్యాగ్‌లైన్ తగిలించి వండి వదిలేస్తున్నారు. అయితే ఇప్పుడు బహిరంగ సమావేశాలు, చివరికి ప్రెస్మీట్లు వంటి వాటిలో కూడా ఓపెన్ బూతులు మాట్లాడేయడం మామూలు అయిపోతున్నదా అనే భయం కలుగుతోంది. ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆలీ, బాలకృష్ణ వంటి వారు బహిరంగ వేదికల మీదే.. బూతును స్ఫురింపజేసే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
మరీ అంత పచ్చిగా ఒకరిని కించపరిచేది కాకపోయిన, పచ్చిబూతు భావం ధ్వనింపజేసే కామెంట్‌తో క్రికెటర్ సురేశ్ రైనా ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు. టీమిండియాకు కొత్త కోచ్ గురించి ఇప్పుడు అన్వేషణ సాగుతోంది. రాహుల్ ద్రవిడ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కోచ్ ఎవరైతే బాగుంటుందని విలేకరులు రైనాను అడిగితే ”సొంతభార్యతో సౌకర్యంగా ఉంటుందా? మరొకరితో సౌకర్యంగా ఉంటుందా?” అంటూ రైనా మీడియాను ఎదురు ప్రశ్నించడంతో ఆ విలేకరి అవాక్కయ్యాడు. ఆసమయానికి విలేకర్లంతా పెద్దగా నవ్వేయడం వలన తీవ్రత తెలియలేదు గానీ… ఓపెన్ ప్రెస్మీట్లలో మరీ ఇలాంటి బూతులా అంటూ అంతా నివ్వెరపోతున్నారు.