కడప జిల్లా బద్వేలు గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే అది అసెంబ్లీ నియోజకవర్గం. కానీ హైదరాబాద్ శివారులోని ఉన్న బుద్వేలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాతే ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అది మరింత హాట్ ప్రాపర్టీ అయింది. అవడానికి చిన్న గ్రామమే అయినా ఇప్పుడు భూములు బంగారం అయ్యాయి.
బుద్వేల్ లో హెచ్ఎండీఏ వంద ఎకరాల వెంచర్ ను అభివృద్ది చేసి వేలం వసేింది. దాని చుట్టూ వందల ఎకరాల్లో భారీ నివాస, నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో బుద్వేల్ మరో కోకాపేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి బుద్వేల్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుద్వేల్ నుంచి కేవలం 15 నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ కు చేరుకోవచ్చు. అంటే సిటీలోకి బెస్ట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది.
బుద్వేల్ కు ఒకవైపు హిమాయత్‌సాగర్ వ్యూ కనిపిస్తుండగా, మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఇంకో వైపు రాజేంద్ర నగర్ ఉంటాయి. బుద్వేల్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్ లో ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉన్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లలో బుద్వేల్ కు సమీపంలో ఉన్నాయి. హెచ్ఎండీఏ వేలంలో ఇక్కడ ఎకరానికి కనిష్ఠంగా 33.25 కోట్ల ధర పలకగా, అత్యధికంగా ఎకరానికి రూ. 41.75 కోట్ల ధర పలికింది. బుద్వేల్ హెచ్ఎండీఏ వెంచర్ వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొని భూములను దక్కించుకోవడంతో భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టాయి.
నిర్మాణ సంస్థలు అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మిస్తుండగా.. డబుల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ. 80 లక్షల నుంచి మొదలవుతోంది. ఇక విల్లాలు ప్రాజెక్టు, విస్తీర్ణాన్ని బట్టి రూ. 3 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. ఇక హెచ్ఎండీఏ వెంచర్ అభివృద్దితో ఇక్కడ భారీ నివాస ప్రాజెక్టులు రానుండటంతో రాబోయే రోజుల్లో హాట్ ప్రాపర్టీగా మారుతుందని అంచనా వేస్తున్నారు.