Bagheera Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2/5
-అన్వర్-
భారీ సినిమాలకు పెట్టింది పేరు హోంబలే ఫిలింస్. ఆ సంస్థ నుంచి వచ్చిన కేజీఎఫ్, కాంతార, సలార్ పాన్ ఇండియా విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు శ్రీమురళి హీరోగా, ప్రశాంత్ నీల్ అందించిన కథతో ఆ సంస్థ తీసుకొచ్చిన సినిమా ‘బఘీర’. ప్రచార చిత్రాల్లో యాక్షన్ భారీగా కనిపించింది. మరి సూపర్ హీరో జోనర్ లో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతిని పంచింది? సూపర్ హీరో సాహసాలు ఆకట్టుకునేలా ఉన్నాయా? ప్రశాంత్ నీల్ అందించిన కథలో కొత్తదనం ఉందా?
వేదాంత్ (శ్రీమురళి) నిజాయితీ, ధైర్యం గల ఐపీఎస్ ఆఫీసర్. ట్రైనింగ్ పూర్తి చేసుకొని తన సొంతూరు మంగళూరులో విధులు నిర్వహించదానికి వస్తాడు. అక్కడ పోర్ట్ లో కొన్ని అరాచక శక్తులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటాయి. వాళ్ళందరిన్నీ చావబాది సెల్ లో వేస్తాడు. ఇంత నిజాయితీగా పని చేస్తున్న వేదాంత్ కు పై అధికారి నుంచి రెడ్ సిగ్నల్ వస్తుంది. చేసిందిచాలు ఇక ఆపేయాలని వార్నింగ్ లాంటి సలహా ఇస్తాడు పోలీస్ కమిషనర్. సరిగ్గా ఇదే సమయంలో ఓ అమ్మాయి దారుణంగా రేప్ కి గురౌతుంది. ఈ ఘటనలో వేదాంత్ నిస్సాయుడిగా మిగిలిపోతాడు. పోలీస్ అంటే సూపర్ హీరో అని చిన్నప్పటి నుంచి భావించిన వేదాంత్ కి సిస్టంలోని డొల్లతనం తెలుసోస్తుంది. తన అధికారంతో బాధితులకు ఏమీ చేయలేని నిస్సాయతలో వున్న వేదాంత్ మారువేషంలో ముసుగు మనిషిగా న్యాయం చేయాలని బఘీర అవతారం ఎత్తుతాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో రాణా (గరుడ రామ్) ఎవరు? అతను చేస్తున్న అరాచకాలు ఏమిటి? బఘీర గా మారింది వేదాంత్ అని పోలీసులు కనుక్కోగలిగారా? లేదా ? అనేది తక్కిన కథ.
అరాచకాలు చేసే విలన్స్ ని అంతం చేసే హీరో. సూపర్ హీరో కథలన్నీ దాదాపు ఇదే లైన్ లో వుంటాయి. అయితే ఇలాంటి కథలు ఇచ్చే ట్రీట్మెంట్ లోనే కొత్తదనం వుండాలి. తెరపై కదిలే సూపర్ హీరోతో ప్రేక్షకుడికి ఒక కనెక్షన్ ఏర్పడాలి. అప్పుడే ఇలాంటి కథలు రక్తికడతాయి. బఘీరలో అలాంటి కొత్త ట్రీట్మెంట్, ఎమోషనల్ కనెక్షన్ వుండదు. అడుగుకో యాక్షన్ సీన్ వుంటుంది కానీ అందులో ఎమోషన్ ఆడియన్ కి పట్టదు. ఊహకు ఈజీగా అందేసే సాధారణమైన కథ ఇది. ప్రశాంత్ నీల్ ఇచ్చిన లైన్ ఏమిటో గానీ ఈ కథని ఎలాంటి థ్రిల్, హై లేకుండా సాదాసీదాగా తీశాడు డైరెక్టర్ సూరి. ఎలాంటి ప్రొటక్షన్ లేకుండా, రిస్క్ అని తెలిసినా కూడా భయపడకుండా డ్యూటీ చేసే పోలీస్ రియల్ సూపర్ హీరో అని హీరో తల్లి చెప్పిన మాటలతో కథమౌతుంది. బర్త్ అఫ్ సూపర్ హీరో, బర్త్ అఫ్ విజిలెంటే, కాన్ఫ్లిక్ట్ ఇన్ ది టేల్, హంటింగ్ బిగిన్, డూ ఆర్ డై, ఫైనల్ షో డౌన్.. ఇలా చాప్టర్లుగా ఈ కథ చెప్పుకుంటూ వెళ్లారు. అయితే ఇందులో ఏ చాప్టర్ కూడా వావ్ అనిపించేలా వుండదు. వెబ్ సిరీస్లో ఎపిసోడ్ కు ఓ పేరు పెట్టినట్టు కొన్ని సీన్లకు కలిపి ఓ పేరు పెట్టారంతే.
సూపర్ హీరో కథల్లో విలన్ బలంగా వుండాలి. హీరోకి, విలన్ కి మధ్య సంఘర్షణ కుదరాలి. ఇందులో విలన్ వున్నాడు కానీ ఆ క్యారెక్టర్ కేవలం బిల్డప్ కే పనికొచ్చింది. ఆ విలన్ చేసే యాక్షన్ అంటూ ఏమీ వుండదు. అసలు విలన్, హీరో కి మధ్య సంఘర్షణే వుండదు. హీరో నచ్చినట్లు ఊచకోత కోస్తుంటాడు. అతడికి ఎదురే వుండదు. క్లైమాక్స్ లో తప్పితే హీరో ప్రయాణం అంతా ఏకపక్షంగా ఉంటుంది. తెరపైన భీభత్సమైన యాక్షన్ సీన్లు వస్తుంటాయి కానీ అందులో పర్పస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ కొంతలో కొంత బెటర్. సెకండ్ హాఫ్ లో ఈ కథ ఇంకా ట్రాక్ తప్పుతుంది. విలన్ ముందుకు రాడు. బఘీరని పట్టుకోవడానికి ప్రకాష్ రాజ్ చేసే ప్రయత్నాలు, తనని తాను రెడీ చేసుకోవడానికి బఘీర చేసే సన్నాహాలు రక్తికట్టవు. బ్యాట్ మ్యాన్ తరహాలో ఏదో స్పెషల్ బైక్, సూట్ తయారు చేశారు కానీ ఆ ఐటమ్స్ పే అవ్వలేదు. పైగా క్లైమాక్స్ ని సాగదీశారు. ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ సీన్ బావుంది కానీ అప్పటికే ఆడియన్స్ నిరాశలో కూరుకుపోయివుంటారు.
శ్రీమురళి కష్టపడ్డాడు. పాత్రకు తగ్గ ఫిజిక్ ని రెడీ చేసుకున్నాడు. యాక్షన్ సీన్స్ ని సాలిడ్ గా చేశాడు. అయితే ఆ పాత్రని అంత బలంగా తీర్చిదిద్దకపోవడంతో ఆ యాక్షన్ అంతా రొటీన్ గా అనిపిస్తుంది. విలన్ గా గరుడ రామ్ సగం కాలిన మొహంతో భయంకరంగా కనిపించడమే తప్ప తను చేసింది ఏమీ లేదు. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ అందంగా కనిపించింది, ఆపాత్రని కూడా చాలా రొటీన్ గా తీర్చిదిద్దారు. ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ ని సరిగ్గా వాడుకోలేదు. అచ్యుత్ తో పాటు మిగతా నటులు పాత్రల మేరకు కనిపించారు.
అజినీష్ లోక్ నాథ్ పాటలు రిజిస్టర్ కావు. నేపధ్య సంగీతం బావుంది కానీ కొన్ని చోట్ల శ్రుతిమించి ఫీలింగ్ కలిగిస్తుంది. కెమెరాపని తనం బావుంది. విజువల్స్ లో రిచ్ నెస్ వుంది. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. యాక్షన్ సీన్స్ పై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. నిర్మాణంలో రాజీపడలేదు. కేవలం యాక్షన్ ని నమ్ముకొని తయారైన సినిమా ఇది. మరి ఎంతమందికి ఎమోషన్ లేని యాక్షన్ కనెక్ట్ అవుతుందో ప్రశ్నార్ధకం. మొత్తానికి దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయిన ప్రశాంత్ నీల్.. కథకుడిగా ఈ సినిమాలో తేలిపోయాడు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన కథ, కేజీఎఫ్ తీసిన నిర్మాణ సంస్థ అని ఏవేవో అంచనాలు వేసుకొని థియేటర్లకు వెళ్తే.. దొరికిపోవడం ఖాయం.
తెలుగు360 రేటింగ్: 2/5
-అన్వర్-