సినీవర్గాలు అనుకున్నదే నిజమయ్యేలా ఉంది. బాహుబలి-2 రిలీజింగ్ లో తీవ్రజాప్యం తప్పేటట్లులేదు. బాహుబలి పార్ట్ వన్ సినిమా చివర్లో `బాహుబలి కన్ క్లూజన్ 2016’లో అని వేశారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే బాహుబలి-2 నత్తనడకన సాగుతున్నట్లే ఉంది. 2016 డిసెంబర్ లోనైనా రిలీజ్ చేసే లక్షణాలు ఏకోశానా కనబడటంలేదు. అంటే రాజమౌళి ప్రేక్షకులకు ఇచ్చిన మాట తప్పబోతున్నారా? దీనికి కారణాలేమిటి?
మొదటి పార్ట్ విజయోత్సవాల మత్తులో ఉన్న చిత్ర యూనిట్ ఇవ్వాళ్టికి కూడా చివరిభాగం గురించి సీరియస్ గా ఆలోచించడంలేదు. ఇంకా టైమ్ ఉన్నదికదా…అన్న ధోరణిలోనే ఉన్నారు. ఈనెల (నవంబర్)లో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాల్సిఉండగా, అవి డిసెంబర్ లో కానీ మొదలయ్యేలా లేవు. డిసెంబర్ 12 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.
నిజానికి బాహుబలి రెండుభాగాలుగా తీయాలని దర్శకుడు రాజమౌళి మొదట్లో అనుకోలేదు. అయితే నిడివి పెరిగే ప్రమాదం రావడంతో రెండు ముక్కలుగా డివైడ్ చేశారు. మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే సుమారు 40శాతం వరకు ఆఖరిభాగం పనులు పూర్తిచేసుకున్నారు. మిగతా 60శాతం పనులు ఏడాదిలో లాగించేయవచ్చని అనుకున్నారు. కానీ సీన్ మారింది.
రాజమౌళి సహజంగానే క్వాలిటీమీదనే ఎక్కువ శ్రద్ధపెడుతుంటారు. గతంలో తీసిన కొన్ని సన్నివేశాల్లో చాలామటుకు రాజమౌళికి నచ్చలేదనీ, ఇంకా మెరుగ్గా తీయవచ్చని ఆయన భావిస్తున్నారని తెలిసింది. అలాగే, రెండవ భాగంలో ప్రభాస్, రానా దగ్గుబాటి , అనుష్కల నడిచే యుద్ధసన్నివేశాల ప్లానింగ్ విషయంలో రాజమౌళి ఎంతకీ రాజీపడటంలేదని తెలిసింది. బాహుబలిని మూడున్నరేళ్లుగా ప్లాన్ చేస్తున్న రాజమౌళి, రెండవ భాగాన్ని తెరకెక్కించే విషయంలో మరింత శ్రద్ధ పెడుతున్నారు. పైగా సైజ్ జీరో చిత్రంతో లావెక్కిన అనుష్క సన్నబడి డిసెంబర్ కల్లా సెట్స్ కి రావాల్సిఉంది.
ఆఖరి భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామంటూ కమిట్ అయినప్పటికీ, రాజమౌళి తత్వం తెలిసినవారెవరూ దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని సినీవర్గాలు చెబుతున్నాయి. టైమ్ ఎంత తీసుకున్నామన్నదానికంటే, క్వాలిటీనే తనకు ప్రధానమని గతంలో రాజమౌళీ చెప్పడాన్ని ఈ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. యుద్ధ సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా చూపించాలని రాజమౌళి అనుకోవడం వల్లనే బాహుబలి-2 రిలీజ్ 2016లో కాకుండా 2017లో ఉండవచ్చని భావిస్తున్నారు.
డైరెక్టర్ రాజమౌళి స్టయిలే అంత… మొత్తానికి బాహుబలి 2 రిలీజ్ లో లేట్ అయినా ఎక్కడా రాజీపడకుండా సినిమా అందిస్తారన్న పూర్తి విశ్వాసం మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే మరోఏడాదైనా ఆగుతారు. దటీజ్ రాజమౌళి.