బాహుబలి ద బెగినింగ్ కథ చివర్లో ప్రేక్షకునికి ఓ పెద్ద సందేహం తలెత్తుతుంది. ఇంతకీ ఈ కట్టప్ప అన్నవాడు, హీరో బాహుబలిని చంపడమేమిటి? చివరకు, ఈ సందేహంతోనే బాహుబలి పార్ట్ వన్ చూసేసి, ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టేస్తున్నాడు ప్రేక్షకుడు.
బాహుబలి ఎందుకు వెన్నుపోటుకు గురైయ్యాడో తెలియాలంటే వచ్చే ఏడాది (2016) వరకు వేచిఉండాల్సిందే. అయితే కొంతమంది ప్రేక్షకులు చాలా అసహనంగా ఫీలైపోతున్నారు. ఈ సస్పెన్స్ ను భరించలేకపోతున్నారు.
`బాహుబలి పార్ట్ 2 తప్పకుండా చూస్తాంరా బాబూ, సస్పెన్స్ భరించలేకపోతున్నాంరా, చెప్పండిరా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలిస్తే చెప్పండర్రా…’ అంటూ కనబడ్డవారినల్లా అడిగేవారు ఎక్కువయ్యారు. పార్ట్ 2 కథను ముందుగా చెబితే సినిమా చూసేటప్పుడు థ్రిల్ ఉండదన్నవారూ ఉన్నారు. అయితే, చెప్పకపోతే బీపీ పెరిగిపోతుందంటూ హైరానపడేవారికి ఊరటకలిగించే వార్త మాత్రం ఇదే…
మొబైల్ లో సందేశాలు పంపుకోవడానికి ఉపయోగిస్తున్న అప్లికేషన్- వాట్సాప్ లో ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కథ లీకై స్ప్రెడ్ అవుతోంది. ఒకరినుంచి మరొకరికి… యమవేగంగా… దీంతో బాహుబలి – కట్టప్ప చుట్టూ ఉన్న సస్పెన్స్ కు చాలామంది ఇప్పటికే తెరదించేశారు. స్టోరీలైన్ ఒకరి నుంచి మరొకరికి షేర్ అవుతండటంతో ఇదో సంచలనవార్తఅయింది.
ప్రభాస్, తమన్నా, అనుష్క, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ వంటి హేమాహేమీలు నటించిన బాహుబలి చిత్రం ఆఖరిభాగం కథ ఇంచుమించు అంతా ఊహించినట్టుగానే ఉంటుంది. కట్టప్ప పాత్రకు బానిస స్వభావం ఉంటుందికనుక రాజు ఎలా చెబితే అలా గుడ్డిగా చేసుకుపోతుండాలి. బాహుబలి మొదటి పార్ట్ కథ ప్రకారం ప్రభాస్ రాజవుతాడన్న సంగతి తెలుస్తుంది. అలాంటప్పుడు రాజుని కట్టప్ప ఎందుకు చంపాల్సివస్తున్నదన్నది ప్రశ్న. కథను ఇంతవరకూ అంతా ఊహించగలిగారు. కానీ బాహుబలి రాజ్యాధికారాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందా? భల్లాలదేవ రాజైపోతాడా ? అలా రాజైన సమయంలోనే కట్టప్ప బానిసస్వభావాన్ని ఎరగా వాడుకుంటూ బాహుబలిని చంపేందుకు భల్లాలదేవ కుట్రపన్నుతాడా ? అన్న ప్రశ్నలకు సమాధానమే బాహుబలి చివరి భాగం. వాట్సాప్ మెసేజీల్లో కథ బహిరంగం కావడంతో టెన్షన్ పడేవారు హ్యాపీగా ఫీలైతే, అరే, సస్పెన్స్ తెలిసిపోతే చివరిభాగం చూడటం దండుగే అని మరికొందరు పెదవి విరుస్తున్నారు.
ఏదిఏమైనా, ఒకటిమాత్రం నిజం. బాహుబలి చిత్రం గురించి కోట్లాదిమంది ఆలోచించడమే ఈ చిత్రానికి అసలైన విజయం. కథ తెలిసినా, తెలియకపోయినా వచ్చే ఏడాది విడుదలయ్యే చివరిభాగం కూడా ఘనవిజయం సాధించడం ఖాయమని చిత్రబృందం భావిస్తోంది. ఇలాంటివేవీ అడ్డంకి కాదని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. బాహుబలి ఓసుందరమైన దృశ్యకావ్యం. రామాయణం, మహాభారతం వంటి కథలు మనకు పూర్తిగా తెలిసినా కథను నడిపించే తీరుతెన్ను బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇది ఇప్పటికే ఎన్నోమార్లు నిరూపితమైన సత్యం. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సాగుతున్న బాహుబలి చిత్రమాలిక కథ తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. ప్రేక్షకులు మాత్రం క్యూకట్టడం గ్యారంటీ. ఇదే రాజమౌళి విశ్వాసం. ఫలితం ఎలా ఉంటుందో ఏడాది ఆగితే తేలిపోతుంది.
– కణ్వస