సినిమా ప్రభావం ప్రేక్షకునిపై కచ్చితంగాఉంటుంది. సినిమా చూసిరాగానే కాసేపు ఆ పాత్రలు మనల్ని వెంటాడుతుంటాయి. ఆ సినిమాలో హీరోలాగా ఏదోఒకటి చేయాలన్న తపనపడటం మామూలే. అలాగే హీరోయిన్ లా డ్రెస్ వేసుకోవాలనీ, హెయిర్ స్టైల్ ఉంచుకోవాలనుకునేవారూ ఉన్నారు. ఇబ్బందిలేనంతవరకూ ఇమిటేట్ చేసినా అందంచందం. కానీ సాహసాలకు దిగితేనే ప్రమాదం.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే, బాహుబలి సినిమా విడుదలై 50రోజులు దాటి 75రోజుల దిశగా పరుగులుపెడుతుంటే, ఇప్పటికీ ఆ సినిమా గురించి రోజుకోవార్త వస్తూనేఉంది. బాక్సాఫీస్ రికార్డులు, కలెక్షన్ కబుర్ల సంగతిసరేసరి, బాహుబలి కథను ఆధారంగా చేసుకుని కన్నడంలో యక్షగానం సిద్ధంచేసి స్టేజీమీద ప్రదర్శనలు ఇవ్వడం, నదిలో మునిగిపోతున్న జింకపిల్లను ఒక కుర్రాడు శివగామి తరహాలో రక్షించడం వంటి వార్తాకథనాలు వస్తూనేఉన్నాయి. ఇప్పుడు అలాంటి వార్తాకథనమే ఇది.
బక్కబలి తిప్పలు
అది ఒక నది. నదన్నతర్వాత పక్కన రాళ్లూరప్పలు ఎలాగో ఉంటాయి. అక్కడికి కొంతమంది కుర్రాళ్లు చేరారు. వారిలో ఒకడికి ఆ రాళ్లమీద కన్నుపడింది. ఇతనేమీ బలాఢ్యుడుకాడు. బక్కబలి. అయినా బాహుబలిలా సాహసంచేద్దామనుకున్నాడు. వెంటనే అతగాడికి బాహుబలి సినిమాలో శివుడు (ప్రభాస్) అతిపెద్ద శివలింగాన్ని పైకి పెకిలించి దాన్ని భుజానకెత్తుకుని రాళ్లూరప్పలు దాటుకుంటూ జలపాతం క్రింద శివలింగాన్ని ప్రతిష్టింపజేసిన సీనుగుర్తుకొచ్చింది. సినిమాలో ఆ సీను చూస్తున్న ప్రేక్షకులు తన్మయత్వంచెందుతారు. ఈ కుర్రాడుకూడా అలాగే ఫీలయ్యాడు. ఆ సీను అతనిపై ఎక్కువగా ప్రభావం చూపిందనుకుంటా, నది ఒడ్డునున్న ఒక రాయిని పెకిలించాడు. దాన్ని చాలా స్టైల్ గా భుజానకెత్తుకున్నాడు. నదిఒడ్డున ఉన్న రాళ్లమీద నడుచుకుంటూ వెళుతుంటే కాలిజారి పడిపోయాడు. బక్కబలి బోల్తాపడటంతో అది చూసిన స్నేహితులంతా ఫక్కున నవ్వారు. తన సాహసకృత్యం ఫెయిలైనందుకు తెగఫీలైపోయాడు ఈ బక్కబలి.
ఇది మంచిదికాదు
సినిమా షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే హీరో జలపాతాలను లెక్కచేయకుండా కొండలెక్కగలడు, పెద్దపెద్ద రాళ్లను భుజానవేసుకుని అవలీలగా నడుచుకుంటూ వెళ్లగలడు. కానీ జాగ్రత్తలు పాటించకుండా, హీరో చేశాడుకదా అని సాహసాలు దిగితే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. బాహుబలి సినిమాలోనే ప్రభాస్ (శివుడు) ఎత్తైన జలపాతం దగ్గర కొండనెక్కే ప్రయత్నం చేస్తాడు. జారే కొండరాళ్లమీదనుంచీ, బాగాతడిసిన ఊడలను పట్టుకుంటూ, జారుకుంటూ పైకి వెళతాడు. సినిమా కాబట్టి పైకి చేరడం ఖాయం. ఆ సీను ప్రభావంతో సాహసం చేయడం మూర్ఖత్వమే అవుతుంది. సినిమాల్లోనూ, వ్యాపారప్రకటనల్లోనూ చూపించే సాహసకృత్యాలను తామూ చేయాలని యువత అనుకోవడం ఎప్పటికీ మంచిదికాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పిల్లలు, యువతలో ప్రధానంగా చైతన్యం కలిగించాలి. ఈ తాజా సంఘటన మనకు చాటిచెప్పేది అదే.
– కణ్వస