బాహుబలిలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), స్పెషల్ ఎపెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఇప్పుడంతా అంగీకరిస్తున్న విషయం. చిత్రం చూస్తుంటే మనం కథలో లీనమై నిజంగానే అక్కడ జలపాతం ఉన్నట్టు, నదీప్రవాహం పోటెత్తిపోతున్నట్టు, చెట్టుచేమతో కొండప్రాంతం పచ్చటిదుప్పటి పరుచుకున్నట్టు, అద్భుత శిల్పకళాసంపదతో మాహిష్మతిసామ్రాజ్యపు కోట… హీరోయిన్ కళ్లెదుట జరజరా పాకే పసిగిరిపాము…ఇలా ఒకటేమిటీ ఎన్నో సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశారు ఈసినిమా ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అతని బృందం. ఆ కృషివెనుక విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్), స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ విషయానికివస్తే మకుట విజువల్స్ కంపెనీని అభినందించాల్సిందే.
బాహుబలి సినిమాకోసం ఎంతో కష్టపడి ఉన్నవిలేనట్టుగా, లేనివిఉన్నట్టుగా తమ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో సన్నివేశాలను పండించారు. ఈ కంపెనీ ఇప్పుడు బ్రేకింగ్ డౌన్ పేరిట ఒక వీడియో తీసి నెట్ లోఉంచారు. అయితే ఆ వెంటనే ఏంజరిగిందోఏమోకానీ ఆ వీడియోని నిలిపివేశారు. ఈలోగానే విఎఫ్ఎక్స్ వీడియోని చాలామందే చూశారు. బాహుబలిసినిమాలోని కొన్ని కీలకసన్నివేశాలను విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ లతో ఎలా తీశారో కళ్లకుకట్టినట్టు చూపించారు ఈ కంపెనీ సాంకేతిక నిపుణులు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తక్కువకాకుండా సాంకేతిక విలువలను పండించడం తమకెంతో ఆనందంగా ఉన్నదని మకుట విఎఫ్ఎక్స్ కంపెనీ తెలియజేసింది. వాస్తవజీవితంలో మనంఎన్నడూ చూడని అద్భుతాలను రీల్ లైఫ్ లో చూపించడంలో ఎన్నో క్లిష్టతరమైన నిర్ణయాలు తీసుకున్నారు. బాహుబలి విఎఫ్ఎక్స్ ప్రాజెక్ట్ పూర్తయ్యేదాకా కంపెనీలోని ప్రతిఒక్కరూ ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. శివగామి (రమ్యక్రిష్ణ) పసిబిడ్డను నదీప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒకచేత్తో పైకి ఎత్తిపట్టుకున్న సన్నివేశం హైలెట్. ఈ సన్నివేశాన్ని చేతిలో బిడ్డకు బదులుగా కిన్ లే వాటర్ బాటిల్ ని పట్టుకుని తీశారంటే ఆశ్చర్యమే. సినిమాలో మాత్రం అరచేతిలో పసిబిడ్డే కనబడుతుంది. అలాగే, జలపాతం దగ్గరకు ప్రభాస్ పరుగుపెడుతూ వెళ్ళే సన్నివేశాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ ఆవరణలో బ్లూమ్యాట్ ఉపయోగించి తీశారు. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ తో అక్కడో జలపాతం ప్రత్యక్షమైంది.
బాహుబలిలో జలపాత సన్నివేశాన్ని దర్శకులు రాజమౌళి ఎలా తీశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాలని మకుట విజువల్స్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ జలపాత సన్నివేశం షూట్ చేయడానికి రాజమౌళికి సుమారు 109రోజులు పట్టిందట. ఇంతకష్టపడబట్టే బాహుబలి ఇన్ని సంచలనాలు సృష్టిస్తోంది.
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా వంటి హేమాహేమీలు నటించిన బాహుబలి థియేటర్లలో 50రోజుల పండుగను పూర్తిచేసుకుని 75రోజుల దిశగా సాగిపోతోంది.
– కణ్వస