తెలుగువాడి సత్తా అంతర్జాతీయ వేదికపై చాటింది బాహుబలి. ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానాలు లేవు. బాహుబలి సినీ అభిమానులకు ఎంత నచ్చిందో.. ఆ చిత్రం సాధించిన రికార్డులే చెబుతాయి. ఇదే బాహుబలి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డునీ గెలుచుకొంది. ఇన్నేళ్ల జాతీయ అవార్డు చరిత్రలో ఉత్తమ చిత్రంగా ఓ తెలుగు సినిమా నిలిచిందే లేదు. ఆ విధంగానూ… బాహుబలి గర్వపడేలా చేసింది. అయితే… బాహుబలిపై విమర్శలు లేకపోలేదు. ఈ సినిమాలో సాంకేతికత తప్ప.. రాజమౌళి ఎమోషన్లు కనిపించలేదని, సగం కథకే జాతీయ అవార్డు ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినిపించాయి. వీటిపై రాజమౌళి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.
”వీలైనంత ఎక్కుమందికి నచ్చేలా సినిమా తీయడం దర్శకుడిగా నాబాధ్యత. ‘బాహుబలి’తో అదే చేశానని అనుకొంటున్నా. ఈ సినిమాకి తెగిన టికెట్ల సంఖ్య చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. ఇక విమర్శించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాళ్ల గురించి నేను పట్టించుకోను” అంటూ తేల్చేశాడు. అవార్డుల గురించి అసలు తాను పట్టించుకోనని, అలాంటప్పుడు బాహుబలికి అవార్డు రావడం పట్ల ఎవరో ఏదో అంటే.. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని షినిషింగ్ టచ్ ఇచ్చాడు రాజమౌళి.