ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దిశగా ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కవిత అస్వస్థతకు గురి కవడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించి మళ్లీ జైలుకే తరలించారు. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని టెస్టులు చేయించాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు అనుమతించింది. ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించి.. నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.
కవిత నాలుగు నెలలకుపైగా జైల్లో ఉన్నారు. బెయిల్ పిటిషన్లు విచారణలకు వచ్చిన ప్రతీ సారి సీబీఐ , ఈడీ కొత్త చార్జిషీటు వేయడం లేదా.. తీవ్రమైన అభియోగాలను మోపడం వంటివి చేస్తున్నాయి. ఫలితంగా బెయిల్ రావడం లేదు. పైగా ఈ కేసులో కింగ్ పిన్‌గా ఆమెను చూపిస్తన్నాయి. అలాగే ఈ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్, సిసోడియాలకు ఇంకా బెయిల్ రాలేదు. అప్రూవర్లుగా మారిన వారికి మాత్రం విముక్తి లభించింది. కవితకు అప్రూవర్ గా మారే అవకాశం లేదు.
ఈ క్రమంలో ఆమె మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ వచ్చినా… సీబీఐ కేసులో రాలేదు. కవిత కూడా ఇప్పుడు బెయిల్ తెచ్చకోవాలంటే అటు సీబీఐ.. ఇటు ఈడీ కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాలి. అది ఇప్పుడల్లా అయ్యే పని కాదు. కానీ మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇస్తే అన్ని కేసులకూ వర్తించే అవకాశం ఉంది. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎయిమ్స్ లో టెస్టుల తర్వాత కవిత.. మరోసారి మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కావాలని పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.