జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇసుక సహా ఆంధ్రప్రదేశ్ గనులన్నింటిని దోచి పెట్టి తాను కొంత స్వాహా చేసిన గనుల వెంకటరెడ్డికి ఎవరికీ తెలియకుండా బెయిల్ వచ్చేసింది. ఆయన అప్పటికప్పుడు విడుదలైపోయారు కూడా. చాలా తీవ్రమైన అభియోగాలు ఉన్న ఆయనను పట్టుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. పారిపోయి దాక్కున్నన్ని రోజులు కూడా జైల్లో ఉండలేకపోయారు. కస్టడీలో కూడా రెండు రోజులే ఉన్నారు. అయినా నెలరన్నర కాక ముందే ఆయన బెయిల్ పై వచ్చేశారు. విషయం బయటకు తెలిసే సరికి ఆయన విడుదలైపోయారు.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో కింది కోర్టులు ఎప్పుడూ బెయిల్ ఇవ్వవు. భారీ ఆరోపణలు ఉన్న వ్యక్తులు హైకోర్టులోనే బెయిల్ కోసం ప్రయత్నిస్తూంటారు. కానీ వెంకటరెడ్డికి మాత్రం ఏసీబీ కోర్టులోనే బెయిల్ లభించింది. ఎంత గుట్టుగా అంటే.. అదే రోజు సాయంత్రం ఆయన విడుదలైపోయారు. కోస్టుగార్డ్ లో పని చేసే జగన్ సీఎం కాగానే ఏపీ మీద వాలిపోయారు. గనుల్ని అడ్డగోలుగా దోచుకున్నారు. దోచి పెట్టారు. తాను చైనా మిషన్ల పేరుతో చేయాల్సిన దోపిడీకి రంగం సిద్ధం చేశారు. ఇలా చెప్పుకుంటే పక్కా సాక్ష్యాలతో ఆయన అడ్డంగా దొరికిపోయారు. కానీ ఏసీబీ అధికారులు కోర్టు ముందు ఉంచడంలో విఫలమయ్యారో.. మరో కారణమో కానీ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేసింది.
వెంకటరెడ్డి విదేశాలకు వెళ్లకుండా…. వారానికో సారి ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యేలా షరతులు విధించారు. అడ్డగోలు దోచిన వారిపై కూడా గట్టిగా కేసులు నమోదు చేసి శిక్షలు విధించలేని పరిస్థితుల్లో ఏసీబీ ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ఓడిపోయినా తన అవినీతికి సహకరించిన అధికారుల్ని కాపాడుకుని తద్వారా తాము బయటపడటానికి వ్యవస్థలను కూడా బాగానే ఉపయోగించుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.