ఫోన్ ట్యాపింగ్ కేసులో పది నెలలకుపైగా జైల్లో ఉన్న నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల విలువైన రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. పాస్ పోర్టులు సమర్పించాలని షరతు విధించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఇటీవల ఈ కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలం జైల్లో ఉండటం..కేసు దర్యాప్తు ముందుకు సాగకపోవడం వల్ల వీరికి బెయిల్ లభించింది. మరో నిందితుడు ప్రణీత్ రావు ఇంకా జైల్లో ఉన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసు నమోదు చేశారు. ఫలితాలు వచ్చిన రోజున కీలక సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ట్యాపింగ్ రికార్డులన్నీ నాశనం చేయడంతో పరిశోధన చేసి కేసులు పెట్టి అరెస్టులు చేశారు. అయితే ఈ కేసులో అసలు నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అంతకు ముందే అమెరికా వెళ్లిపోయారు. ఆయన రాలేదు. ఇప్పటికీ ఆయన రాకపోవడంతో కేసు ముందుకు సాగడం లేదు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే తాము చేశామని అరెస్టు అయిన వారు వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని.. బీజేపీ అగ్రనేతలు, గవర్నర్లను కూడా వదిలి పెట్టలేదని దర్యాప్తు అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే వారి బెయిల్ మాత్రం ఆపలేకపోయారు. అమెరికా నుంచి ప్రభాకర్ రావు వస్తే తప్ప.. ఈ ట్యాపింగ్ కేసులో ముందడుగు పడే పరిస్థితి లేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది.