యూనివర్సిటీ ప్రాంగణంలో దేశ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించి, నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన జె.ఎన్.యు.విద్యార్ధి నేత కన్నయ కుమార్ కి బుదవారంనాడు డిల్లీ పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనిని దోషిగా నిరూపించే బలమయిన ఆధారాలను ఏవీ లేకపోవడంతో అతనికి రూ.10,000 సొంత పూచీకత్తుపై ఆరు నెలల పాటు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు అయ్యేసరికి చాలా ఆలస్యం అయినందున అతను రేపు ఉదయం జైలు నుండి విడుదలవుతాడు.
అతని విషయంలో చాలా అతిగా స్పందించి అత్యుత్సాహం ప్రదర్శించిన డిల్లీ పోలీసులకు, వారికి ఆ ఆదేశాలు జారీ చేసిన కేంద్రప్రభుత్వానికి ఇది చెంపదెబ్బ వంటిదేనని చెప్పవచ్చును. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి వేముల రోహిత్ విషయంలో ఎదురు దెబ్బ తిన్న తరువాత కూడా కేంద్రం జాగ్రత్త పడకుండా, కన్నయ్య కుమార్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్ళినందుకు ఎదురు దెబ్బ తింది. అతని అరెస్ట్ చేసినందుకు విమర్శలు మూటగట్టుకొంది. ఇప్పుడు అతను నిర్దోషి అని తేలి బెయిల్ కూడా పొందాడు కనుక మోడీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అతనిపై కక్ష కట్టి వేధించినట్లయింది.
అతను దేశ వ్యతిరేకత ప్రదర్శించనప్పుడు, డిల్లీ పోలీసులు అతనిని ఎందుకు అరెస్ట్ చేసారు? అతనిపై దేశ ద్రోహం నేరం వంటి తీవ్ర నేరారోపణ ఎందుకు చేసారు? దాని వెనుక కారణాలు ఏమిటి? అనే సందేహం కలగడం సహజం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చెపుతున్న ప్రకారం అతను బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.లకి అనుబంధంగా పనిచేసే ఒక విద్యార్ధి సంఘాన్ని వ్యతిరేకించడమే కారణమని భావించవలసి ఉంటుంది.