ఓటీటీ వల్ల క్రియేటీవిటికి ఇంకాస్త ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. వెండి తెరపై చెప్పలేని కొన్ని కథల్ని ఓటీటీకి చెప్పొచ్చు. వెబ్ సిరీస్ లో ఇంకాస్త సమయం దొరుకుతుంది. తీరిగ్గా.. ప్రతిభనంతా పారేసుకోవొచ్చు కాకపోతే.. ఎంత చెప్పినా, ఏది చెప్పినా అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? లేదా? అనేది సరి చూసుకోవాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? వాళ్లకు మాత్రమే నచ్చితే సరిపోతుందా? లాంటి లెక్కలు అవసరం. అలాంటి లెక్కలు తప్పితే – వెబ్ సిరీస్ అయినా, సినిమా అయినా ప్రేక్షకులకు చాలా దూరంగా నిలబడిపోతుంది. `ఆహా`లో ఇప్పుడు ఓ కొత్త వెబ్ సిరీస్ వచ్చింది. `బేకర్ అండ్ బ్యూటీ` పేరుతో. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించింది. సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. కాబట్టి… తప్పకుండా ఓ లుక్ వేయాలనిపిస్తుంది. అలా వేస్తే.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? దర్శకుడి లెక్కలు సరిపోయాయా? అవెక్కడైనా తప్పయా?
విజయ్ (సంతోష్ శోభన్) ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంటిల్లిపాది మొత్తం బ్యాకరీ కమ్ సూపర్ మార్కెట్ నడిపిస్తుంటారు. చిన్నప్పటి స్నేహితులురాలు మహి (విష్ణు ప్రియ)ని ప్రపోజ్ చేద్దామనుకుంటాడు. అయితే మహినే.. విజయ్ కి ప్రపోజ్ చేస్తుంది. కానీ అంతకు ముందే.. ఐరా (టీనా శిల్పరాజ్) అనే ఓ స్టార్ హీరోయిన్ ని చూసి.. తొలి చూపులోనే ఇష్టపడతాడు విజయ్ అందుకే మహి ప్రపోజల్ కి నో చెబుతాడు. అనూహ్యంగా ఐరాతో విజయ్ పరిచయం పెరుగుతుంది. అప్పటికే ఐరా బ్రేకప్ లో ఉండడం వల్ల… విజయ్ కి దగ్గరవుతుంది. కానీ చిన్న చిన్న విషయాలు, సంఘర్షణలు, మిస్ అండర్స్టాండింగులూ… వీరిద్దరి మధ్య దూరం పెంచుతూ ఉంటాయి. మళ్లీ దగ్గరవుతూ ఉంటారు. ఈ ప్రయాణం చివరికి ఏమైంది? విజయ్ ని ఇష్టపడిన మహి.. ఈ ప్రేమకథకు ఎలా అడ్డుపడింది? అనేదే కథ.
బేకర్ అండ్ బ్యూటీ కథని ఇంత క్లుప్తంగా చెప్పుకున్నాం గానీ, ఈ కథలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కథలో అనడం కంటే ఈ పాత్రల్లోనే ఆ గందరగోళం ఉందనుకోవాలి. ఎందుకంటే.. విజయ్, ఐరా అనే రెండు లీడ్ క్యారెక్టర్ల స్వభావం మనకు ఓ పట్టాన అర్థం కాదు. మహిని ఇష్టపడిన విజయ్.. అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకుంటాడు. ఓ సందర్భంలో… ఐరా ని ఛీ కొట్టి… ఆ ఫస్ట్రేషన్లో.. మహికి ప్రపోజ్ చేసి, రింగ్ తొడుతుతాడు. మళ్లీ ఐరాకి దగ్గరై.. మహికి సారీ చెబుతాడు. అంటే… తనకు ఎవరు కావాలో.. విజయ్ లో స్పష్టత లేనట్టే కదా??
ఐరా పాత్ర కూడా అంతే గందరగోళంగా ఉంటుంది. తనకు విజయ్ ని కలవకముందే ఒకరితో బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ కి కారణం… తను మరొకరితో పడక సుఖం పంచుకోవడం వల్లే… అని నిక్కర్చిగా చెబుతుంది. దాంతో.. పాటు విజయ్ ని ప్రేమిస్తుంది. విజయ్ పై తనకు ఉన్నది ప్రేమో, జాలో, ఎట్రాక్షనో.. లేదంటే తనకు ఇది వరకే బ్రేకప్ అవ్వడం వల్ల వచ్చిన ఫస్ట్రేషన్ వల్ల దగ్గరైందో.. అనే విషయంలో చివరి వరకూ క్లారిటీ ఉండదు.
నిజానికి ఈ వెబ్ సిరీస్.. చాలా క్యాజువల్ గా, ఇంట్రస్టింగ్ నోట్ తో మొదలవుతుంది. ఓ బేకర్ ని స్టార్ హీరోయిన్ నైట్ అవుట్ కి తీసుకెళ్లడం ఆసక్తి కలిగించే అంశమే. ఓ స్టార్.. ఓ అనామకుడ్ని ఎందుకు నైట్ అవుట్ కి తీసుకెళ్తుంది? అనే లాజిక్ కీ రీజనింగ్ ఇచ్చారు. అయితే ఆ తర్వాతర్వాత… ఒకే పాయింట్ చుట్టూ కథ నడుస్తుందన్న ఫీలింగ్ కలుగుతంది. సన్నివేశాల్లో సహజత్వం కోసమనో, లేదంటే ఎలాగూ వెబ్ సిరీసే కదా.. టైమ్ లిమిట్ ఏముంటుందన్న ఉద్దేశ్యంతోనో.. ఈ కథని ఎటు నుంచి ఎటో తీసుకెళ్లిపోయారు. దుబాయ్ ఎపిసోడ్ మొత్తం అనవసరం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఎపిసోడ్ వల్ల ఈ కథలో కొత్తగా వచ్చిన కిక్ ఏమీ ఉండదు. అక్కడ కూడా హీరో, హీరోయిన్ల గోలే. ఫ్లైట్ లో సీన్ అయితే దాదాపు 10 నిమిషాలు సాగుతుంది. అలా సాగి.. సాగి… ఈ వెబ్ సీరస్ ని 10 ఎపిసోడ్లు చేసేశారు. కనీసం సగం ఎపిసోడ్లు లేపేస్తే… కథలో షార్ప్నెస్ వచ్చేది.
కథంతా సింగిల్ లేయర్ లోనే సాగుతుందన్న అనుమానం దర్శకుడికి వచ్చి ఉంటుంది. అందుకే.. హీరో తమ్ముడు, చెల్లాయి పాత్రల్ని రంగంలోకి దింపారు. తమ్ముడు, చెల్లి…. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం ఈ కథలో ట్విస్టు అనుకోవాలి. `గే`, లెస్బియన్ ఎఫెక్టులు ఈకథకు అవసరమా? అనిపిస్తుంది. వీరిద్దరి ట్రాకులతో ఈ కథని మరో రెండు ఎపిసోడ్లు పెంచారు. నిజం చెప్పాలంటే మహి, లక్ష్మి (వెంకట్) పాత్రలనే దర్శకుడు బాగా రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. వీరిద్దరిలోనే నిజాయతీ కనిపిస్తుంది. మహి ప్రేమలో ఓ స్వచ్ఛత ఉంది. ఐరా మేనేజర్ పాత్రలో లక్ష్మి.. ఆలోచనలు కూడా నిస్వార్థంగా ఉంటాయి. అదే ఎఫెక్ట్ మిగిలిన పాత్రలపైనా పెట్టాల్సింది.
సంతోష్ శోభన్ అత్యంత సహజంగా నటించాడు. తనలో మెచ్యురిటీ మరింత పెరిగింది. అన్ని రకాల ఎమోషన్లూ ఈజీగా పలికిస్తున్నాడు. టీనా అందంగా ఉంది. తనలో రకుల్ ఫీచర్స్ కనిపించాయి. విష్ణు ప్రియకి మంచి పాత్ర దక్కింది. ఇక…వెంకట్ చాలా రోజుల తరవాత కనిపించాడు. ఇటీవల ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా – తాను చేసిన లక్ష్మి పాత్రతోనేఎక్కువ ఆకట్టుకుంటాడు. సంతోష్ శోభన్ తమ్ముడిగా నటించిన అబ్బాయి కూడా మంచి ఈజ్ తో చేశాడు. ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు సహజంగా ఉన్నాయి.
దర్శకుడు అనుకున్న పాయింట్ రొమాంటిక్ గానే ఉంది. కానీ దాన్ని అనవసరంగా సాగదీసి విసిగించాడు. పాత్రలెక్కువ. అందులో క్లారిటీ తక్కువ. ట్రిమ్ చేసుకుంటే సగం భారం, బాధ తప్పేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓ వెబ్ సిరీస్ కోసం దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేశారంటే.. అర్థం చేసుకోవొచ్చు. ఓటీటీలో ఈమధ్య చాలా వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే వాటిలో కొన్నే గుర్తుంటాయి. బేకర్ అండ్ బ్యూటీ మాత్రం గుర్తు పెట్టుకునే స్థాయిలో లేదు.