‘బలగం’తో దర్శకుడిగా ఆకట్టుకొన్నాడు వేణు ఎల్దిండి, ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో మరో ప్రయత్నం చేయబోతున్నాడు. నితిన్ హీరో. ముందు ఈ కథ నాని దగ్గరకు వెళ్లింది. ఆ తరవాత నితిన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. కథానాయికగా ముందు నుంచీ… సాయి పల్లవినే అనుకొన్నారు. ఆమెకు కథ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి స్థానంలో కీర్తి సురేష్ వచ్చింది. ఇటీవలే కీర్తికి కథ చెప్పారు. ఆమెకు బాగా నచ్చింది. కావల్సినన్ని కాల్షీట్లు ఈ సినిమాకు ఇస్తానని చెప్పింది. దాంతో హీరోయిన్ బాధ తప్పింది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం వేణు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నాటక సంఘాలు, అక్కడి నటీనటుల్ని కలుస్తున్నాడు. ‘ఎల్లమ్మ’లో నాటకాలకు సంబంధించిన ఓ అంశం వుంది. అందుకోసం రంగస్థల కళాకారుల్ని తీసుకోవాలని భావిస్తున్నాడు. ఈ సినిమాతో కొత్త నటీనటుల్ని వెండి తెరకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వేణు.
తెలంగాణ జాన పదాలు, కళలకు పెద్ద పీట వేస్తున్న సినిమా ఇది. దైవత్వానికి సంబంధించిన అంశాలూ ఈ కథలో ఉన్నాయి. విజువల్ పరంగా కొంత కేర్ తీసుకోబోతున్నాడు వేణు. తొలి సినిమా ‘బలగం’ సింపుల్ గా, ప్రయోగాత్మకంగా రూపొందించారు. ‘ఎల్లమ్మ’ అలా కాదు. భారీ బడ్జెట్ అవసరం అవుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్టుపై పూర్తి స్థాయి కసరత్తులు చేస్తున్నాడు వేణు. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.