యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ దృష్టీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 100వ సినిమాపైనే ఫోకస్ అయ్యింది. బాలయ్య ఎవరితో జట్టు కడతాడు? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నలు నందమూరి అభిమానుల్ని గత రెండేళ్లుగా తొలిచేస్తున్నాయి. వాటికి సమాధానాలు ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. బాలయ్య వందో సినిమా క్రిష్ దర్శకుడన్నది కన్ఫామ్ అయిపోయింది. ఓ చారిత్రక నేపథ్యమున్న కథతో… బాలయ్యను క్రిష్ ఒప్పించగలిగాడు. గౌతమి పుత్ర శాతకర్ణి గా బాలయ్యను వెండి తెరపై చూపించబోతున్నాడు. అయితే… ఈ సినిమాకి బడ్జెట్ ఎంత పెట్టొచ్చన్న విషయంపై బాలయ్య మల్లగుల్లాలు పడుతున్నట్టు టాక్.
సాధారణంగా బాలయ్య సినిమా అంటే రూ.25 నుంచి 35 కోట్లకు లోపే ఉంటుంది. లెజెండ్ సినిమా రూ.50 కోట్ల మైలు రాయిని అందుకొన్న నేపథ్యంలో బడ్జెట్ పెంచడానికి నిర్మాతలూ రెడీగా ఉన్నారు. అయితే… బాలయ్య వందో సినిమాకి ఈ బడ్జెట్ డబుల్ కానుంది. దాదాపు రూ.65 కోట్లతో బాలయ్య వందో సినిమా రూపుదిద్దుకొంటున్నట్టు సమాచారం. గౌతమి పుత్ర శాతకర్ణి చాలా వాస్ట్ కాన్వాన్ ఉన్న కథ. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దితే గానీ… కథకు న్యాయం జరగదు. పైగా వార్ ఎపిసోడ్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయిస్తున్నట్టు టాక్. ఈ కథకు దాదాపుగా రూ.65 కోట్లు అవుతుందని దర్శకుడు క్రిష్ ప్రాధమికంగా అంచనా వేశాడట. దానికి బాలయ్య నుంచి కూడా ఆమోదముద్ర లభించిందని సమాచారం. క్రిష్ – వారాహి చలన చిత్రం సంస్థలు కలసి బాలయ్య వందో సినిమాని నిర్మించబోతున్నాయి. సో.. బాలయ్య కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించే చిత్రం అవ్వనున్నది.