నందమూరి బాలకృష్ణ మాటంటే మాటే. ఒక్కసారి మాటిచ్చాక.. మడమ తప్పడం ఉండదు. కృష్ణవంశీ విషయంలోనూ అదే జరిగింది. బాలయ్య వందో సినిమా కృష్ణవంశీతో చేయాల్సింది. రైతు అనే కథ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కాల్సింది. కానీ.. చివరి నిమిషాల్లో వందో సినిమా కి డైరెక్ట్ చేసే అవకాశం క్రిష్ ఎగరేసుకొని వెళ్లిపోయాడు. కృష్ణవంశీ నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే బాలయ్య మాత్రం ”కృష్ణవంశీ నీతో తప్పకుండా సినిమా చేస్తా.. ” అని మాటిచ్చాడు. 101వ సినిమాగా రైతుని తెరకెక్కిద్దాం అని భరోసా ఇచ్చాడు. ఈ విషయాన్ని బాలయ్య సైతం అభిమానుల సాక్షిగా చెప్పేశాడు. ప్రస్తుతం హిందూపురం నియోజక వర్గంలో పర్యటిస్తున్నాడు బాలయ్య. అక్కడ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ”ప్రస్తుతం వందో సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. 101వ చిత్రంగా రైతు సినిమా ఉంటుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారు..” అని క్లారిఫై చేశారు. కృష్ణవంశీతో బాలయ్య సినిమా తప్పకుండా ఉంటుందని, 101వ చిత్రం అదే అవుతుందని ఇది వరకే తెలుగు 360. కామ్ తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. బాలయ్య భరోసా ఇవ్వడంతో కృష్ణవంశీ ఆనందానికి అవధుల్లేవ్.. ప్రస్తుతం ఆయన సందీప్ కిషన్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయ్యాక.. రైతు స్క్రిప్టు పనుల్లో పడతారు.