పెద్ద హీరోలతో సినిమా అంటే దర్శకులకు పెద్ద టెన్షన్. కథలో కొత్తదనంతో పాటు అభిమానుల అంచనాలు అందుకోవాలి. అందులోనూ బాలయ్య లాంటి గాడ్ అఫ్ మాసెస్ తో సినిమా అంటే చాలా ఒత్తిడి వుంటుంది. దర్శకుడు బాబీపై కూడా ఇప్పుడు అలాంటి ఒత్తిడి వుంది.
‘డాకు మహారాజ్’ ని బాలయ్య ఇమేజ్ తగ్గట్టు అన్ని హంగులతో మలిచాడు బాబీ. రేపే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. అభిమానులు, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే నెర్వస్నెస్ బాబీలో ఖచ్చితంగా వుంటుంది.
అయితే బాబీపై ఒత్తిడిని తగ్గించేశారు బాలయ్య. ‘డాకు మహారాజ్ పై డౌట్ లేదు. బాబీ నేను కలసి కథని రెడీ చేసుకున్నాం’అని స్వయంగా చెప్పారు. ‘ఆదిత్య 369’లో కృష్ణదేవరాయలు మారువేషంలో వచ్చి కృష్ణకుమార్‌ను కాపాడే పాత్ర ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండిపోయింది. అందుకే అలాంటి పాత్రతో తెరపై ఫుల్ లెంగ్త్‌లో కనిపిస్తే బాగుంటుంది అనుకుని.. నా ఆలోచనతో బాబీ కథని రెడీ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరినీ అలరిస్తుంది’ అని చెప్పారు.
నిజానికి కథల్లో హీరోల ప్రమేయం కొంత వరకు ఉంటుంది. కానీ చాలా మంది హీరోలు రిజల్ట్ చూసి కానీ బయటపడరు. ఫలితం తేడా వస్తే ఎక్కడ వేలు తమవైపు చూపిస్తారేమో అని భయం. కానీ బాలయ్య రూటే వేరు. విడుదలకు ముందే కథలో తన ప్రమేయం వుందని ధైర్యంగా చెప్పారు. బాలయ్య స్టేట్మెంట్ ఒక విధంగా బాబీపై ఒత్తిడిని తగ్గించినట్లే.