బాలకృష్ణ కలల ప్రాజెక్టు `నర్తనశాల`. ఈ సినిమాని తన స్వీయ దర్శకత్వంలో మొదలెట్టి, 5 రోజుల షూటింగ్ తరవాత ఆపేశారు. ఇప్పుడు ఆ 5 రోజుల పాటు తీసిన రెండు సన్నివేశాలే… 17 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రియాస్ ఈటీ ద్వారా ఈనెల 24 నుంచి ఈ సన్నివేశాల్ని చూడొచ్చు. ఈ `నర్తనశాల `గురించి తొలిసారి బాలయ్య స్పందించారు.
”మహాభారతంలో నర్తనశాల పర్వం నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అందులో అన్ని రసాలూ ఉంటాయి. అందుకే ఆ పర్వాన్ని ఎంచుకున్నా. ఆ సినిమా నా కలల చిత్రం. 2002లో మొదలెట్టాం. నాకింకా గుర్తు… నటీనటుల కాల్షీట్లు పది రోజుల పాటు తీసుకుని.. కేవలం 5 రోజుల్లోనే అనుకున్న సన్నివేశాల్ని పూర్తి చేశా. నాది నాన్నగారి స్కూలు. నటీనటులకు గౌరవం ఇవ్వడం నాకు తెలుసు. కొంతమంది అలా కాదు.. సెట్లోకి నటీనటులంతా వస్తే గానీ ఫ్రేము పెట్టరు. నేను అలా కాదు.. ఎవరొస్తే… వాళ్లకు సంబంధించిన సన్నివేశాల్ని తీసేసేవాడ్ని. తీసినవి రెండు సీన్లే.. కానీ.. బాగుంటాయి. కళ అన్నది మరుగున పడడం నాకిష్టం ఉండదు. అది బయటకు తీయాల్సిందే. అందుకే `నర్తనశాల`ని బయటకు తీసుకొచ్చాం. సౌందర్య మరణంతో ఈ సినిమాని ఆపేశాను. ద్రౌపతి పాత్రకు ప్రత్యామ్నాయం నాకు దొరకలేదు. ఏమో… భవిష్యత్తులో ఈ సినిమా తీస్తానేమో” అని చెప్పుకొచ్చారు.