కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా మారడంతో.. షూటింగులు ఎక్కడిక్కడ వాయిదా పడ్డాయి. పెద్ద హీరోలైతే ఇంట్లోంచి బయటకు రావడానికి ససేమీరా అంటున్నారు. నాని `శ్యామ్ సింగరాయ్` ఒక్కటే షూటింగు జరుపుకుంటోంది. కొన్ని చిన్నా చితకా చిత్రాలు మినహా.. ఏవీ సెట్స్ లో లేవు. అయితే ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ రిస్క్ చేయబోతున్నాడు. బాలయ్య తాజా సినిమా `అఖండ` సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ బ్రేక్‌లో ఉందిప్పుడు. ఈనెల 12 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నారు. తక్కువ మంది సిబ్బందితో.. అతి తక్కువ రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ లు మాత్రమే పాల్గొంటార్ట. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సివుంది. కేవలం 40 నుంచి 50 మంది క్రూ ఉంటే చాలని, అందుకే ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. బాలయ్యకు రిస్క్‌లు చేయడం అలవాటే. మొన్నటి వరకూ ఆయన `అఖండ` సెట్లోనే ఉన్నారు. ఇప్పుడే కాస్త బ్రేక్ తీసుకున్నారు. బోయపాటి ఎప్పుడు అడిగితే అప్పుడు కాల్షీట్లు ఇవ్వడానికి బాలయ్య రెడీనే అని సమాచారం.