బాలకృష్ణ ని చూపించాలంటే బోయపాటి శ్రీనునే… అని ఎందుకంటారో… ఇప్పుడు `అఖండ` ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బాలయ్య ఫైర్నీ, బ్రాండ్‌ని, స్టైల్‌నీ, పొగరుని, పవరుని.. ఇలా బాలయ్యలోని కోణాలన్నింటికీ ఆవిష్కరిస్తూ.. `అఖండ` ట్రైలర్ కట్ చేసిన విధానం ఫ్యాన్స్ కి పండగలా అనిపిస్తుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో రూపుదిద్దకుంటున్న చిత్రమిది. జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.
విధికి, విధాతకీ, విశ్వానికీ సవాళ్లు విసరకూడదు
– అనే డైలాగ్ తో అఖండ ఫైర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి.. చివరి వరకూ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది. యాక్షన్, డైలాగులు, హీరోయిజం బిల్డప్ షాట్లు – ఏ ఫ్రేము చూసినా భారీదనం – పక్కా కమర్షియల్ హంగులతో, అచ్చంగా బోయపాటి మార్క్ తో కథని సిద్ధం చేసినట్టు ట్రైలర్ చెప్పకనే చెప్పింది.
ఇక బాలయ్య డైలాగులు, మాడ్యులేషన్ గురించి చెప్పాలి. సింహా, లెజెండ్ లను గుర్తు చేసేలా.. డైలాగ్ పవర్ సాగింది.
“అంచనాలు వేయడానికి నువ్వేమైనా పోలవరం డామా, పట్టుసీమ తూమా, పిల్ల కాలువ…“
ఒకమాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం… దైవ శాసనం..
ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే, బ్రేకుల్లేని బుల్డోజర్ని, తొక్కి పరదొబ్బుతా..
లైఫ్టా, రైటా, టాపా, బోటమా ఎటుదించి ఎటుపెట్టి గోకినా కొడకా… ఇంచు బాడీ దొరకదు
మీకు సమస్య వస్తే… దండం పెడతారు
మేం ఆ సమస్యకే పిండం పెడతాం..
ఇలా సాగింది ఆ ప్రవాహం. అఘోరాగా బాలయ్య ఎలా కనిపిస్తాడు? తన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వాటిపై కూడా ఓక్లారిటీ వచ్చేసింది. బాలయ్య పవర్ కి తగ్గట్టుగానే ఆ పాత్రని తీర్చిదిద్దారన్న విషయం అర్థం అవుతుంది.
ఈ సినిమాలో శ్రీకాంత్ కి విలన్ పాత్ర దొరికింది. బోయపాటి కథల్లో విలన్ ఎప్పుడూ స్ట్రాంగే. ఇది వరకు చూసిన నటుడ్నే కొత్త కోణంలో చూపించడం బోయపాటి స్టైల్. ఈసారీ అదే జరిగింది. శ్రీకాంత్ ని నెవర్ బిఫోర్ అనే టైపులో చూపించాడు.
“నాకు బురదంటింది.. నాకు దురదొచ్చింది, నాకు బ్లడ్డొచ్చింది, నా కడ్డొచ్చింది.. అంటూ అడ్డమైన సాకులు చెప్పి పనాపితే…“ అంటూ.. శ్రీకాంత్ తన విలనిజం చూపించేశాడు. దానికి తోడు విజవల్స్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తెరపై కనిపిస్తున్న నటీనటులు.. ఇవన్నీ ట్రైలర్ టెంపో పెంచేశాయి.
కథేమిటి? అనే విషయంలో దర్శకుడు ఎలాంటి క్లూ ఇవ్వకపోయినా, ఈ సినిమా మాత్రం పక్కా మాస్, కమర్షియల్ లెక్కలతోనే సాగబోతోందని తెలుస్తూనే ఉంది. బాలయ్య ఫ్యాన్స్ కి ఈ మాత్రం టెంపో చాలు. బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించడానికి.