సింహా, లెజెండ్, అఖండ… బాలకృష్ణ, బోయపాటి శ్రీనులు కలిస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో చెప్పిన సినిమాలు. వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానుంది. 2023లోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న బాలయ్య – బోయపాటి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ‘అఖండ’కు కొనసాగింపుగా వచ్చే సినిమా ఇది. టైటిల్ ‘అఖండ 2’ అని పెడతారా, కొత్త టైటిల్ తో వస్తారా? అనేది చూడాలి. ప్రస్తుతం బాలయ్య బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కానుంది. నవంబరులోగా షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబరు నుంచి బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
‘అఖండ’ కోసం పని చేసిన సాంకేతిక నిపుణులే ఈ చిత్రానికీ పని చేసే అవకాశం ఉంది. ప్రగ్యా జైస్వాల్ ఓ కథానాయిక. మరో కథానాయిక కోసం వేట సాగుతోంది. బోయపాటి ఇది వరకే స్క్రిప్టు సిద్ధం చేశారు. ఈ కథలో భారీ యాక్షన్ తో పాటు, హిందుత్వ అంశాలూ మేళవించారని తెలుస్తోంది. `అఖండ`లో ఆ పాయింట్ బాగా క్లిక్ అయ్యింది. సినిమా విజయంలో దోహదం చేసింది. ఇప్పుడు కూడా అదే పాయింట్ పై ఫోకస్ చేశారని తెలుస్తోంది. దేవాలయాల ప్రాముఖ్యతకు సంబంధించి ఓ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉందని, అది సినిమాకే హైలెట్ కానుందని సమాచారం అందుతోంది. అక్టోబరు 16 ముహూర్తం రోజునే టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.