బాలకృష్ణ చేసిన సిస్టర్ సెంటిమెంట్ సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది.. ముద్దుల మావయ్య. అందులో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ని ఓ రేంజ్ లో చూపించారు. ఆ సినిమాతో బాలయ్య కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయాడు. ఆ తరవాత… బాలయ్య సిస్టర్ సెంటిమెంట్ సినిమాలేం చేయలేదు. అయితే ఇప్పడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. దీన్నో పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా అందరూ చూస్తున్నారు. నిజానికి.. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ పుష్కలంగా రంగరించారని తెలుస్తోంది. బాలయ్య చెల్లాయిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇద్దరి మధ్యా… బలమైన సన్నివేశాలు రాశాడట దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పీక్స్ లో చూపించబోతున్న సినిమా ఇదని, యాక్షన్ తో పాటుగా ఎమోషన్ని కూడా అదే స్థాయిలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఓ అగ్ర కథానాయకుడు ఈమధ్య సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఆ లోటు బాలయ్య తీరుస్తున్నాడు. అన్నట్టు… చిరంజీవి `భోళా శంకర్` కూడా సిస్టర్ సెంటిమెంట్ సినిమానే. అందులో చిరు చెల్లాయిగా కీర్తి సురేష్ నటిస్తోంది.