హైదరాబాద్: రానున్న సంక్రాంతి పండగ రేసులో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణమధ్య పోటీ తప్పేటట్లు లేదు. సుకుమార్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం జనవరి 8వ తేదీన విడుదల అవుతుందని ప్రకటించేశారు. ఎన్టీఆర్‌కు, తమ బ్యానర్‌కు ఇది ప్రెస్టీజియస్ చిత్రమని నిర్మాత ప్రసాద్ చెప్పారు. సెప్టెంబర్ 20 వరకు లండన్‌లో, తర్వాత స్పెయిన్‌లో 20 రోజులు షూటింగ్ చేయటంతో సినిమా పూర్తవుతుందని తెలిపారు. శ్రీమంతుడులో కీలక పాత్రలు పోషించిన జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలోకూడా ఉండటం విశేషం. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరోవైపు లౌక్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో వేదాశ్వ క్రియేషన్స్ రూపొందిస్తున్న బాలకృష్ణ 99వ చిత్రం డిక్టేటర్ కూడ సంక్రాంతికి సిద్దమవుతోంది. ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ రచన చేయటం విశేషం. కథానాయికలుగా అంజలి, నయనతార నటిస్తున్నారు. సంగీతం తమన్.
మరోవైపు పవన్ కళ్యాణ్ సర్దార్, మహేష్ బ్రహ్మోత్సవంకూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. సర్దార్ చిత్రం షూటింగ్ ఇప్పటికే పట్టాలపైకెక్కిన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం షూటింగ్ ఈనెలాఖరుకు ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఒకే షెడ్యూల్లో చిత్రం పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇవికూడా పూర్తయితే సంక్రాంతి రేసు రచ్చ రచ్చగానే ఉంటుందనటంలో సందేహంలేదు.