రీరిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. రీరిలీజ్ లో వచ్చే కలెక్షన్స్ ని కూడా అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మార్చిలో రెండు పెద్ద సినిమాలు రీరిలీజ్ కి రెడీ అయ్యాయి. రామ్ చరణ్ మగధీర ఆయన బర్త్ డే సందర్భంగా మార్చి 27న వస్తుంటే.. బాలకృష్ణ లెజెండ్ 30న విడుదలౌతుంది. రెండూ సూపర్ హిట్ సినిమాలే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సరికొత్త చరిత్రని సృష్టించింది. రాజమౌళి విజన్ ఏమిటో తెలియజేసిన చిత్రమిది. రామ్ చరణ్ ఇమేజ్ ని ఒక్కసారి పెంచిన సినిమా కూడా ఇదే. మంచి థియేట్రికల్ అనుభూతిని ఇచ్చే ఈ సినిమా రీరిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ ఫ్లాప్ సినిమా ఆరెంజ్ రీరిలీజ్ లో అనుహ్యమైన వసూళ్లు సాధించింది. దీంతో మగధీర ఎంత కలెక్ట్ చేస్తుందో అనే ఆసక్తి వుంది.
బాలకృష్ణ బోయపాటిలది హ్యాట్రిక్ కాంబినేషన్. సింహా తర్వాత ఈ ఇద్దరూ కలసి చేసిన లెజండ్ కూడా మంచి విజయం సాధించింది. బోయపాటి మార్క్, బాలయ్య మాస్ ప్రేక్షకులని అలరించాయి. పొలిటికల్ టచ్ వున్న కంటెంట్ ఇది. అప్పట్లో కూడా లెజెండ్ పొలిటికల్ హీట్ ని పెంచింది. ఇప్పుడు మరోసారి ఎన్నికల సెగ సమయంలో విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఇందులో చాలా వైరల్ డైలాగులు వున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ డైలాగులు వినిపించబోతున్నాయి. ప్రస్తుతం రాజకీయాలకు తగట్టుగానే పంచ్ డైలాగులు ప్రత్యర్ధులకు తగిలేలా రీరిలీజ్ ట్రైలర్ కట్ చేశారు. మొత్తానికి మార్చిలో వస్తున్న ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా దేనికవే భిన్నమైనవి. మరి అభిమానులు హంగామా ఎలా వుంటుందో చూడాలి.