బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఎప్పటినుంచో బాలకృష్ణ భావిస్తున్నారు. ఆయనే కథ, కథనం చేసే పనిలో వున్నారు. తన వారసుడు మోక్షజ్ఞ ని ఈ సీక్వెల్ తోనే లాంచ్ చేయాలని అనుకున్నారు. అయితే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో అది జరగలేదు.
అయితే ఎట్టకేలకు స్వయంగా బాలయ్య నుంచి ‘ఆదిత్య 369’పై అధికారిక ప్రకటన వచ్చింది. ‘అన్స్టాపబుల్ సీజన్ 4’ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ద్వారా ఇది రివిల్ అయ్యింది.‘‘ఆదిత్య 369కు సీక్వెల్గా ‘ఆదిత్య 999’ రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అన్నీ కుదిరితే 2025లో విడుదల చేసే అవకాశం ఉంది’’అని చెప్పారు బాలయ్య .
‘ఆదిత్య 369 బాలయ్య కెరీర్ లోనే కాదు తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. బాలయ్య పోషించిన రాయలు వారి పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోపోయింది. అలాంటి క్లాసిక్ కి సీక్వెల్ అంటే అంచనాలు తారస్థాయికి చేరుతాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన తొలి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మోక్షజ్ఞ.